భగవంతుడు భావప్రియుడు
అబ్దుల్లా మసీదులో ఒక మూల నిద్రిస్తున్నాడు. అతనికి మెలకువ వచ్చింది. ఇద్దరు దేవదూతలు మాట్లాడుకుంటున్నారు. వారిద్దరు భక్తుల జాబితాను తయారు చేస్తున్నారు. ఒక దేవదూత అంటున్నాడు, “సికందర్ నగరంలో ఉండే మహబూబ్ కు ఈ జాబితాలో మొదటి స్థానం ఉంటుంది. అతను ఎన్నడూ మక్కాకు రాలేదు. అయినా అతడు పరమ భక్తుడు”.
ఇది విని అబ్దుల్లా వెంటనే సికందర్ నగరానికి బయలుదేరాడు. అక్కడ విచారించాడు. మహబూబ్ ఒక చెప్పులు కుట్టుకొని జీవించేవాడని తెలిసింది. అతడు చాలా పేదవాడు, కృశించిన శరీరంతో ఉన్నాడు. ఎంతో జాగ్రత్తగా తాను సంపాదించిన కొద్ది ధనంలోనే కొంత ఆదా చేశాడు. దానితో తన భార్యకు చక్కని విందు ఏర్పాటు చేయదలచుకున్నాడు.
మహబూబ్ ఒకనాడు విందుకు కావలసిన తినుబండారాలు, మిఠాయిలు కొనుక్కొని ఇంటికి వెళుతున్నాడు. దారిలో విపరీతమైన ఆకలితో అలమటించి పోతున్న ఒక వ్యక్తిని చూచాడు. వెంటనే అతనివద్ద కూర్చొని తనవద్ద ఉన్న ఖరీదైన తినుబండారాలను ఒక్కొక్కటి తృప్తిగా తినిపించాడు. ఆ పేదవాని ముఖంలో కలిగిన తృప్తి చూచి తాను పూర్తిగా ఆనందించాడు.
ఈ సత్కార్యమే అతనిని భక్తుల జాబితాలో ప్రధమ స్థానంలో ఉంచింది. అనేక మంది దీనారాలు ఖర్చు చేసి మక్కా యాత్ర చేస్తున్నారు, ఎంతో చేస్తున్నారు, కాని భగవంతుడు ధనం దానం చేసేపని వెనుకవున్న భావాన్ని గుర్తిస్తాడుగాని, ఆడంబరాన్ని చూడడు.
ప్రశ్నలు:
- అబ్దుల్లా మసీదులో నిద్ర లో ఏమి విన్నాడు?
- మహబూబ్ ను గురించి అతడు ఏమి తెలుసుకున్నాడు?
- మహబూబ్ చేసిన ఏ పని అతనికి అంత గౌరవం తెచ్చింది?