నిరాడంబరత
మహానీయులందరు దుస్తుల విషయంలో, మాటల విషయంలో ఎంతో నిరాడంబరంగా ఉంటారు. వారి జీవి విధానంలో ఎటువంటి ఆడంబరం ఉండదు. మహాత్మ గాంధీని చూద్దాం.
ఆయన వేషధారణ ఎలా ఉండేది? ఆయన తరచుగా దేశాధినేతలను, ఉన్నతాధికారులను గొప్ప పదవులలో ఉండేవారిని కలుసుకునేవారు. కాని ఆయన మామూలుగా ధరించే కొల్లాయిగుడ్డ, ఉత్తరీయంతోనే వెళ్ళేవారు. ఈశ్వరచంద్ర విద్యాసాగర్ కూడా అదే విధంగా చాలా నిరాడంబర జీవితం గడిపేవారు. ఆయన గొప్ప విద్యావేత్త, సమాజ సంస్కర్త. ఆయనను ఎప్పుడూ పెద్ద పెద్ద సభలకు, సమావేశాలకు, విందులకు ఆహ్వానిస్తూ ఉండేవారు.
ఒకసారి ఈశ్వరచంద్రను ఒక కులీనుడు పెద్ద విందుకు ఆహ్వానించాడు. ఈశ్వరచంద్ర సాధారణంగా ధరించే ధోవతి, జుబ్బా, ఉత్తరీయంతో ఆ విందుకు వెళ్ళారు. భారత జాతీయతను చాటే ఆ వేషధారణ అంటే ఆయన గర్వపడేవారు. విందు జరిగే భవనం ద్వారం వద్ద ఒక సేవకుడు ఆయనను ఆపి “సాదా దుస్తులతో వచ్చేవారికి ఇక్కడ ప్రవేశం లేదు” అన్నాడు.
విద్యాసాగర్ తిరిగి ఇంటికి వెళ్ళిపోయి పాశ్చాత్య ధారణ చేసి విందు జరిగే భవనానికి వచ్చాడు. ద్వారంవద్ద అదే సేవకుడు చాలా వినయంగా ఆయనను లోపలికి ఆహ్వానించాడు.
అతిధులందరు విందుకు కూర్చుని ప్రధాన అతిధి ఈశ్వరచంద్ర వైపు చూస్తున్నారు. ఈశ్వరచంద్ర వింత ప్రవర్తనకు అందరు ఆశ్చర్యపోతున్నారు. ఆయన భోజనం ప్రారంభించకుండా ఒక స్పూను తీసుకొని తాను ధరించిన కోటుకు, షర్టుకు అందిస్తూ, ‘ఖావో, ఖావో’ అంటున్నాడు. విందు ఏర్పాటు చేసిన వ్యక్తి హడావిడిగా వచ్చి ఈశ్వరచంద్రతో, “అయ్యా! ఏమిటి? మీ ప్రవర్తన ఇలా ఉంది? భోజనం చేయక దుస్తులకు పదార్థాలు అందిస్తున్నారు?” అని అడిగాడు. ఈశ్వరచంద్ర విద్యాసాగర్ ఎంతో నమ్రతగా “అయ్యా! నేను సాదా దుస్తులతో వచ్చినప్పుడు నాకు ఈ భవనంలోకి ప్రవేశం దొరకలేదు. కాని ఈ సూటు, బూటుతో రాగానే ప్రవేశం లభించింది. ఇక్కడ గౌరవించింది నన్ను కాదు. ఈ దుస్తులను. నాకు ప్రవేశం కలిగించినందుకు కృతజ్ఞతగా వీటికి ముందు విందు చేస్తున్నాను” అన్నాడు. అక్కడ ఉన్న వారందరు తలలు వంచుకున్నారు. విందు ఏర్పాటు చేసిన వ్యక్తి ఈశ్వరచంద్రకు క్షమాపణ చెప్పుకున్నాడు.
ప్రశ్నలు
- విద్యాసాగరుకు మొదట ప్రవేశం ఎందుకు లభించలేదు. తర్వాత ఎట్లు లభించింది?
- విద్యాసాగరు తన వింత ప్రవర్తనకు కారణం ఏమని వివరించాడు.
- అతిధులు ఎందుకు ఆశ్చ్యర్య పోయారు.