మంచివి మూడు
ఒక రాజు తన వద్దకు వచ్చిన వారందరిని ప్రశ్నలు అడిగేవాడు.
మొదటిది “అందరిలో ఉత్తముడు ఎవడు?”
రెండు “అన్నింటికి ఉత్తమకాల మేది?”
మూడు “అన్ని పనులలోకి ఉత్తమమయినది ఏది?”
ఈ మూడు ప్రశ్నలకు సరియైన జవాబులు ఎవరు ఇస్తారా? అని రాజు ఎదురు చూచేవాడు.
ఒకనాడు రాజు అడవిలోకి వెళ్ళి పుట్టలు, గుట్టలు అన్నీ తిరుగుతున్నాడు. ఒక ఆశ్రమాన్ని చూచి అక్కడ విశ్రాంతి తీసుకోవాలనుకున్నాడు. రాజు ఆశ్రమం చేరేసరికి ఒక సాధువు మొక్కలకు నీళ్ళు పోస్తున్నాడు. రాజును చూచి ఆహ్వానించి తినడానికి పళ్ళు, త్రాగడానికి చల్లని నీరు ఇచ్చాడు.
ఇంతలో మరొక సాధువు ఒళ్ళంతా దెబ్బలతో రక్తం కారుతున్న ఒక వ్యక్తిని తీసుకొని వచ్చాడు. సాధువు అతనిని పడుకోబెట్టి నీటితో గాయాలు కడిగి, కొన్ని పసరులు పూసి, కట్లు కట్టాడు. ప్రక్కనే కూర్చుని ఉపశమనంగా మంచి మాటలు చెప్పడం ప్రారంభించాడు.
ఇదంతా రాజు గమనించాడు. కొంత సమయానికి రాజు సాధువు వద్ద సెలవు తీసుకొని వెళ్ళడానికి లేచాడు. అతనికి ఇంకా ఆ మూడు ప్రశ్నలే మెదలుతున్నాయి. సాధువుని అడిగాడు “స్వామి వీటికి సమాధానాలు మీరు చెప్పగలరా?”
సాధువు అన్నాడు, “రాజా! ఇప్పుడు ఇక్కడ నీవు చూచిన పనులలోనే ఆ మూడు ప్రశ్నలకు సమాధానాలు ఉన్నాయి వివరిస్తాను వినండి”. అన్నాడు
“మొదట మీరు వచ్చినపుడు నేను మొక్కలకు నీరు పోస్తున్నాను. అది నా విధి. మిమ్మల్ని చూచి మీకు ఆతిథ్యం ఇచ్చాను. అది మన సంప్రదాయ ప్రకారం నా ధర్మము. ఇంతలో దెబ్బలు తగిలి మరొక వ్యక్తి వచ్చాడు. మిగిలిన వన్నీ వదలి అతనికి సపర్య చేయడం ఉత్తమ ధర్మము. ఎవరికి నీ సేవ అవసరమో అతడే ఉత్తమ వ్యక్తి. అతనికి సంపూర్ణ తృప్తి కలిగించే విధంగా సేవ చేయడమే ఉత్తమ కార్యము. ఆ సేవ చేయగలిగిన సమయమే ఉత్తమ కాలము” అని చెప్పాడు.
ప్రశ్నలు:
- రాజు వేసిన మూడు ప్రశ్న లేవి?
- రాజు ఆశ్రమంలో చూచినది ఏమి?
- రాజు గారి ప్రశ్నలకు సాధువు ఏమి సమాధానం చెప్పాడు?