ధర్మమనగా ఏది?
ఒక యువ సన్యాసి అరణ్యానికి పోయి పన్నెండేళ్ళు తపస్సు చేశాడు. ఒకనాడు ఒక చెట్టుకింద కూర్చొని ఉన్నాడు. పైనుండి అతనిమీద ఒక ఎండుటాకు రాలింది. తలెత్తి చూచాడు. పైన ఒక కొమ్మమీద ఒక కాకి, కొంగ పోట్లాడుకుంటున్నాయి. అతను కోపం పట్టలేక “ఏం? బుద్ధి లేదూ? నామీద ఆకులు రాల్చడానికి మీ కెంత ధైర్యం?” అని తీక్షణంగా చూచాడు. అతని చూపులనుండి అగ్నిజ్వాల వంటిది (అతని యోగశక్తి ఫలితం) వెలువడి ఆ పక్షుల్ని భస్మం చేసింది. అది చూచి ఆ సన్యాసి గర్వపడ్డాడు. తనకు అంత శక్తి ఉందని.
కొంత సమయానికి అతను లేచి ఊర్లో ప్రవేశించి ఒక ఇంటి వాకిటి ముందు నిలబడి ‘భవతీ భిక్షాందేహి’ అని బిగ్గరగా అరిచాడు. “కొంచెం నిలబడు నాయనా” అని లోపలి నుండి ఒక వనిత గొంతు వినపడింది. కాని ఎంతకూ ఎవ్వరు రాలేదు. అతని ఓర్పు నశించింది. “ఈ స్త్రీ కి ఎంత అహాంకారము? నన్ను ఇంతసేపు నిలబెడుతుందా?” అని తనలో తాను అనుకుంటున్నాడు. మళ్ళీ ఆ గొంతే వినపడింది. “ఏమయ్యా! నీ యోగ శక్తిని గురించి అనుకుంటున్నావా? నేను ఆ కాకిని, కొంగను కాను. భస్మం కావడానికి.” అతనికి ఆశ్చర్యం వేసింది. చివరకు ఒక స్త్రీ వెలుపలికి వచ్చింది. అతడు ఆమె పాదాలకు నమస్కారం చేసి “అమ్మా! అవి నీకు ఎలా తెలుసు?” అన్నాడు.
“నాయనా! నీ వెవరో నీ యోగ శక్తి ఏమిటో తెలియదు. నేను ఒక సాధారణ గృహిణిని. నా పతి సేవలో నిమగ్నం అయి నిన్ను నిలబెట్టాను. ముందు నా పతి సేవ. దాని తర్వాతే ఏదయినా. వివాహానికి పూర్వము కుమార్తెగా నా విధి నిర్వహించాను. పెళ్ళి అయింది. భర్త ఎడల నా విధి నిర్వహిస్తున్నాను. నాకు తెలిసిన యోగం ఇదే. తపస్సు ఇదే! అందువలనే నా విధి నిర్వహణవల్ల కలిగిన మహత్తు వలనే నీ ఆలోచనలు నాకు తెలిశాయి. ఇంతకు మించి నాకేమి తెలియదు. ఇంకా నీవు ధర్మ సూక్ష్మాలు తెలుసుకోవాలంటే కాశీకి వెళ్ళు. అక్కడ ధర్మవ్యాధుడనే మాంస విక్రేత ఉన్నాడు, ఆయనవద్ద తెలుసుకో” అని చెప్పి తలుపు వేసుకుంది.
సన్యాసి అనుకున్నాడు “నేను తపశ్శాలిని ఒక చండాలుడైన మాంసవిక్రేత వద్ద తెలుసుకోవలెనా?” కాని ఆ గృహిణి మాటల వలన అతని మనోనేత్రం కొంతవరకు విచ్చుకుంది. కాబట్టి వెంటనే కాశీకి వెళ్ళాడు. దారి తెలుసుకుంటూ వెళ్ళి దూరంనుండి ధర్మవ్యాధుని చూచాడు.
ఒక దుకాణం వద్ద జంతువుల శరీరాలనుండి, ఒక పెద్ద కత్తితో మాంసపు ముక్క ఖండించి విక్రయిస్తున్నాడు. “ఆహా! ఇతని వద్దనా నేను తత్వం తెలుసుకొనేది? ఇతనుని చూస్తే పరమ కిరాతకుడివలె ఉన్నాడు!” అనుకున్నాడు.
ఇంతలో ధర్మవ్యాధుడు తలఎత్తి చూచి “స్వామీ! మిమ్మల్నేనా ఆ పతివ్రత పంపింది? ఇదిగో ఇక్కడ కూర్చోండి. నా వ్యాపారం పని ముగించుకొని వస్తాను” అన్నాడు. సన్యాసి ఆశ్చర్యానికి అంతులేదు. “ఆమె పంపిందని అతనికి ఎలా తెలుసు?” అని ఆలోచిస్తూ కూర్చున్నాడు. ధర్మవ్యాధుడు తన పని ముగించుకొని వచ్చి “స్వామీ! రండి మా ఇంటికి పోదాం”అని తన ఇంటికి తీసుకొని వెళ్ళాడు. అక్కడ తన వృద్ధ తల్లిదండ్రులకు మ్రొక్కి, వారికి స్నానం చేయించి, భోజనం అమర్చి, ఇతర సేవలు చేసి సన్యాసి వద్దకు వచ్చి కూర్చున్నాడు. సన్యాసి ఇదంతా వింతగా చూస్తున్నాడు.
ధర్మవ్యాధుడు “స్వామీ! ఇంతకూ మీరు వచ్చిన పనేమిటి?” అని అడిగాడు. సన్యాసి అతనిని భగవంతుడు, జీవిత ధర్మాలు, వీటిని గురించి కొన్ని ప్రశ్నలు వేశాడు. ధర్మవ్యాధుడు ఓపికగా భగవత్తత్వాన్ని, జీవిత ధర్మాన్ని వివరించాడు. ఈ ఉపన్యాసమే ‘వ్యాధ గీత’గా పేరు పొందింది.
ప్రశ్నలు
- పతివ్రత యువ సన్యాసి గురించి ముందుగా ఎలా తెలుసుకో గలిగింది?
- వ్యాథ గీత ఎవరు రచించారు?
- ఈ కధ నుండీ నీవు నేర్చుకున్న నీతి ఏమి?