ఎవరు రాజు?
అలెగ్జాండరు చక్రవర్తి ప్రపంచ దిగ్విజయయాత్ర సాగిస్తూ ఆఫ్రికా ఖండంలో అడుగు పెట్టాడు. ఆయన సైనికులు ఎండకు తాళలేక ఏదైనా ఒక ఇల్లుగాని,చివరికి పెద్ద చెట్టయినా కనపడుతుందా? అని చూస్తున్నాడు. అప్పుడు ఒక రెడ్ ఇండియను సైనికుడు పరుగెత్తుతూ వచ్చి వారిని సమీపించి, తనను అనుసరించి రమ్మన్నాడు. వారు అతనిని అనుసరించారు.
అతడు వారిని రెడ్ ఇండియన్ ల నాయకుని వద్దకు తీసుకొని వెళ్ళాడు. ఆ నాయకుడు, అతని అనుచరులు అందరూ కారు నలుపు రంగులో ఉన్నారు. అలెగ్జాండరుకు, అతని సైనికులకు ఆ నాటికి ఒక తోటలో విడిది ఏర్పాటు చేశారు.
మరుసటిరోజు నాయకుడు అలెగ్జాండరు గౌరవార్థం పెద్దవిందు ఏర్పాటు చేశాడు. ఒక బంగారుపళ్ళెం నిండా బంగారు పండ్లను ఉంచి అలెగ్జాండరు ముందు ఉంచాడు.
ఆశ్చర్యంతో అలెగ్జాండరు ప్రశ్నించాడు. “ఏమిటి మీరు బంగారుతో చేసినపళ్ళను తింటారా? నాయకుడన్నాడు “లేదు! చక్రవర్తీ! మేము మామూలు పళ్ళనే తింటాము. కాని మీరు ప్రపంచ విజేతలు. లెక్కలేని బంగారం కోసం రాజ్యం తర్వాత రాజ్యం జయించుకుంటూ వస్తున్నారు. బహుశా మీరు ఎప్పుడూ బంగారు వస్తువులనే తింటారు కాబోలు అనుకున్నాము.” అలెగ్జాండరుకు కొంతవరకు జ్ఞానోదయం అయింది. ఆయన అన్నాడు “లేదు, లేదు బంగారం కోసం వచ్చినా, ఇక్కడి మానవుల వేషభాషలు, ఆచార వ్యవహారాలు తెలుసుకోవాలనుకుంటున్నాను.”
“ఇక్కడ మా అతిధులుగా కొన్నాళ్ళు ఉండండి” అని నాయకుడు అన్నాడు.
అదే సమయంలో ఇద్దరు వ్యక్తులను భటులు తెచ్చి నాయకుని ముందు ఉంచారు. “ఏమిటి సంగతి? వీరెవరు? చెప్పండి.” అని రెడ్ ఇండియన్ నాయకుడు ఆజ్ఞాపించాడు.
ఒకరితో ఒకరు తీవ్రంగా వాదించుకుంటున్న వారిద్దరిలో ఒకడు “ప్రభూ! ఈ మధ్యనే భూమిని నేను ఇతనికి అమ్మాను. నిన్న భూమి దున్నుతుండే సమయంలో ఇతనికి ఒక బిందె దొరికింది. దాని నిండా బంగారు నాణేలు ఉన్నాయట. ఈ భూమికొన్నాను గాని దానిలో దొరికే మరే వస్తువు నాదికాదు అని ఆ బిందె నన్ను తీసుకోమంటున్నాడు. కాని నేను ఒప్పుకుంటానా? భూమి నీకు అమ్మేశాను దానిలో ఏది లభ్యమయినా అవన్నీ నీకే చెందుతాయి? అంటున్నాను” మీరు న్యాయం చేయండి మహాప్రభూ.
రెండోవాడు “ప్రభూ! నాకు చెందని వస్తువు నా కెందుకు. నాణాల బిందె అతనికే ఇవ్వండి” అన్నాడు.
ఇదంతా వింటున్న అలెగ్జాండరు చక్రవర్తికి మతిపోయినంత పని అయింది. రెడ్ ఇండియన్ నాయకుడు ఏమి తీర్పు ఇస్తాడా? అని ఎదురు చూస్తున్నాడు.
నాయకుడు ఇద్దరినీ ఉద్దేశించి ఇలా అన్నాడు. “చూడండి! మీలో ఒకరి కూతుర్ని రెండోవారి కుమారునికిచ్చి పెళ్ళి జరిపించండి. ఈ బంగారు నాణాల బిందె కట్నం క్రింద ఇవ్వండి” ఇద్దరూ ఎంతో సంతోషించి ప్రభువుకు నమస్కరించి వెళ్ళిపోయారు.
నాయకుడు గ్రీకు చక్రవర్తితో “మీరు రాజుగా ఇటు వంటి సమస్యను ఎలా పరిష్కరిస్తారు?” అని అడిగాడు.
అలెగ్జాండరు అన్నాడు “మా దేశంలో అయితే బంగారును రాజుగారి ఖజానాకు జమకట్టి ఇద్దరినీ ఖైదులో ఉంచుతాము”.
“ఎంత అన్యాయము? ప్రజల మధ్య వచ్చిన వివాదం ఆధారంగా ప్రజల సొమ్మును స్వాధీనం చేసుకునేవాడు నిజంగా రాజు ఆవుతాడా? బందిపోటు అవుతాడా?” నిజమైన రాజు అంటే ప్రజల యోగక్షేమాల కై తన సుఖం కూడా త్యాగం చేయాలి.
ప్రశ్నలు:
I) అలెగ్జాండరుకు ఆఫ్రికా నాయకుడు బంగారు పండ్లను ఎందుకు అర్పించాడు?
2) ఇద్దరిమధ్య వచ్చిన వివాదం ఏ విధంగా ఆ నాయకుడు పరిష్కరించాడు?
3) నిజమైన రాజు ఎవరు?