సంతుష్టస్సతతం – వివరణ
సంతుష్టస్సతతం యోగీ యతాత్మా ధృడ నిశ్చయః |
మయ్యర్పిత మనో బుద్ధి: యోమద్భక్త స్సమేప్రియః ||
భక్తి యోగము – (12-14)
భగవంతునికి ఎవరిపైననూ ప్రీతి కానీ ద్వేషము కానీ లేకున్ననూ ఎవరు భక్తితో సేవించెదరో, వారిపై అనుగ్రహమును వర్షించుదురు. భగవంతునిపై ప్రేమ అందరికీ యుండును. కానీ భగవంతునికి తనపై ప్రీతి యున్నదా అని పరీక్షించుకొనవలెను. ఎల్లప్పడూ తృప్తిని కల్గి, మనో బుద్దులను భగవంతునికి అంకితం చేయువారే ఆయనకు ప్రియమైనవారు.
చిన్న కథ: ఒక సాధువు తన శిష్యుడితో కలిసి ఒక గ్రామానికి వెళ్తున్నాడు. దారిలో ఒక వ్యక్తి కలిసి శిష్యుడిని నిందిస్తూ దుర్భాషలాడడం మొదలుపెట్టాడు. కొంత సేపు ఆ శిష్యుడు అవమానాలను శాంతంగా భరించాడు. అయితే కొంత సేపు తర్వాత సహనం కోల్పోయి ఆ వ్యక్తిని తిరిగి దుర్భాషలాడడం మొదలుపెట్టాడు. వారు పరస్పరం ఒకరినొకరు అవమానించుకోవడం చూచిన సాధువు వారిని విడిచిపెట్టి తన దారిన వెళ్ళపోయాడు. కొద్దిసేపటి తర్వాత గురువు వెళ్ళిపోయారని గమనించిన శిష్యుడు, గబగబా వెళ్ళి గురువును చేరుకున్నాడు. “గురూజీ! మీరు నన్ను ఆ దుష్టునితో ఎందుకు ఒంటరిగా విడిచిపెట్టారు?” అని అడిగాడు.అప్పుడు ఆ సాధువు ఈవిధంగా జవాబిచ్చాడు. “నీవు ఒంటరిగా ఎక్కడ ఉన్నారు? ఆ దుర్భాషలు ఆడే వ్యక్తి సహవాసాన్ని కలిగి ఉన్నావు. నువ్వు ఒంటరిగా ఉన్నంత కాలం నేను నీతోనే ఉన్నాను. దేవతలు కూడా నీతో ఉండడం చూశాను. కానీ, నువ్వు కూడా తిరిగి దుర్భాషలాడడం మొదలుపెట్టాక వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళు వెళ్ళగానే నేను కూడా వెళ్ళిపోయాను.” అన్నాడు.