దేవతల గర్వభంగము
దేవతలకు అసురులకు ఒకప్పుడు మహా సంగ్రామము జరిగింది. బ్రహ్మదేవుడు దేవతల వైపు ఉండి యుద్ధం గెలిపించాడు. కానీ దేవతలు తమ శక్తి సామర్థ్యాల వల్లనే గెలిచామని విర్రవీగుతున్నారు.
బ్రహ్మకు వీరి మిడిసిపాటు గురించి తెలిసింది, చక్కగా గుణపాఠం చెప్పాలని బయలుదేరాడు. దేవతలు విజయోత్సవాలలో మునిగిపోయి ఉన్నారు. వారికి ఆ గర్వంలో ఏదీ కానరావడం లేదు. బ్రహ్మ ఒక దివ్యరూపంతో వారి ముందు నిలి చాడు. ఆ రూపం ఎవరిదో దేవతలు గుర్తించలేక అక్కడ ఉన్న రూపమెవరిదో తెలుసుకొని రమ్మని వారు మొదట అగ్నిని పంపారు. అగ్ని వచ్చి “మీరెవరు?” అని ప్రశ్నించాడు.
బ్రహ్మ “నీ వెవరు?” అని తిరిగి ప్రశ్న వేశాడు. “బ్రహ్మదేవా!నేను అగ్నిని, నా అంత శక్తిమంతుడు మరొకడు లేడు, నేనే తెలియదా నీకు?” అన్నాడు. అలాగా నాకు తెలియదు. అయితే నీవు ఈ గడ్డిపోచను కాల్చగలవా?” అని గడ్డిపోచను క్రింద పడవేశాడు.
“అదెంతపని” అని అగ్ని మహాగర్వంతో దాన్ని తాక బోయాడు. కాని మండలేదు సరిగదా కనీసం ఆ పోచ అంటు కోలేదు కూడా. అగ్ని సిగ్గుపడి వెనక్కు వెళ్ళి దేవతలకు తన ఆసహాయత గురించి చెప్పాడు. వారు వాయువును పంపారు.
వాయువు గర్వంతో వెళ్ళి ముందు నిలబడి “నేను వాయువును. ఎటువంటి బలమైనదిగూడ నా శక్తికి నిలవ లేదు,” అన్నాడు.
“అయితే ఈ గడ్డిపరకను కదిలించు” అన్నాడు బ్రహ్మ.
వాయువు తన శక్తినంతా ప్రయోగించాడు. కాని గడ్డిని వెంట్రుకవాశి కూడా కదిలించ లేక పోయాడు. వాయువు తలవంచుకుని తిరిగి వెళ్ళి దేవతలకు తన అసమర్ధతను చెప్పుకున్నాడు. దేవతలు ఏకగ్రీవంగా తమ రాజు ఇంద్రుణ్ణి వెళ్ళి ఆ రూపం సంగతేదో చూడమని కోరుకున్నారు. ఈ సమయంలో బ్రహ్మ తాను తప్పుకొని ఆధ్యాత్మిక జ్ఞానానికి అధిదేవత ఉమాదేవిని ఆ స్థానంలో నిలబెట్టాడు. ఆమె బంగారు ఆభరణాలు ధరించి, అత్యంత సుందరంగా వెలిగిపోతున్నది.
ఇంద్రుడు వెళ్ళి “అమ్మా! ఇంతవరకు ఇక్కడ దివ్య రూపం ఉన్నదట కదా! ఎవరమ్మా వారు?” అని అడిగాడు.
ఉమాదేవి “మీ స్వల్పబుద్ధులతో తెలుసు కోలేకున్నారు. ఆ దివ్య రూపం సాక్షాత్తు బ్రహ్మదేవుడే! ఆయన వల్లనే మీకు యుద్ధంలో విజయం లభించింది అనే సత్యాన్ని గ్రహించండి.” అని చెప్పింది.
ఇంద్రుడు తిరిగి వెళ్ళి దేవతలకు వివరించాడు. అప్పడు దేవతలు సిగ్గుపడి తమ తప్పును తెలుసుకుని తమకు లభించిన బ్రహ్మ జ్ఞానం తో ఆనందము అనుభవించారు.
ప్రశ్నలు:
- దేవతలు ఎందుకు గర్వపడ్డారు?
- అగ్నికి ఏ విధంగా గర్వభంగమయింది?
- వాయువు ఎందు వలన గడ్డి పరకను కదిలించ లేక పోయాడు?
- ఉమాదేవి ఇంద్రుడికి ఏమి బోధించింది?
- ఈ కధ లోని నీతి ఏమి?