విశ్వామిత్రుడు
పురాణ ఋషులలో పేరు పొందినవాడు, గొప్పవాడు విశ్వామిత్రుడు. కాని ఆయన ముక్కోపి, మాత్సర్యం కలవాడు. ఈ రెండింటి కారణంగా ఆయన అనేకమార్లు కఠినతపస్సు ద్వారా సంపాదించిన శక్తిని ధారపోయవలసి వచ్చింది.
మొదట విశ్వామిత్రుడు రాజుగా ఉన్నప్పుడు వసిష్ఠుని వద్ద ఉన్న కామధేనువును గూర్చి అసూయ పడ్డాడు. తర్వాత తాను తపస్సు చేసి ఋషి అయినపుడు బ్రహ్మర్షి అని అందరి చేత పిలిపించుకున్న వసిష్ఠుని మీద ద్వేషం పెంచుకున్నాడు. ఘోరతపస్సు చేసిన విశ్వామిత్రుని ‘రాజర్షి’ అన్నారు. గాని ‘బ్రహ్మర్షి’ అనలేదు. అది ఆయనకు అవమానంగా తోచింది. ఆ అవమానంతో వసిష్ఠుని మీద అసూయ పెంచుకున్నాడు. ఆయనను చంపివేయాలని గూడా సంకల్పించాడు.
ఒక వెన్నెల రాత్రి విశ్వామిత్రుడు వసిష్ఠుని తపోవనానికి వెళ్ళాడు. ఆ సమయంలో వసిష్ఠుడు, తన సహధర్మచారిణి ఆరుంధతితో సంభాషిస్తూ వనంలో ఉన్నాడు. విశ్వామిత్రుడు ఒక పొదమాటున దాక్కొని వారి సంభాషణ వింటున్నాడు. వారిమాటలు ఆయనకు చక్కగా వినిపిస్తున్నాయి.
అరుంధతి, “స్వామీ! ఈ రాత్రి ఎంత మనోహరంగా ఉంది. ఇటువంటి వాతావరణంలో ఇక్కడ గడపడం ఎంతో అహ్లాదకరంగా ఉంది” అన్నది.
వసిష్ఠుడు, “దేవీ! విశ్వామిత్రుని తపోమహిమ వల్ల విశ్వమంతా ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉంది” అన్నాడు. ఈ మాటలువిన్న విశ్వామిత్రునికి తీవ్రమైన పశ్చాత్తాపం కలిగింది. “బుద్దిహీనుణ్ణి. మాత్సర్యంతో వసిష్ఠుని పై ద్వేషం పెంచుకున్నా నే” అనుకొని వెంటనే లేచి వెళ్ళి వసిష్ఠుని పాదాలమీద పడ్డాడు.
వశిష్టుడు ఆయనను అప్యాతతో లేవదీసి “బ్రహ్మర్షీ లే!” అన్నాడు. విశ్వామిత్రుని జీవిత వాంఛ నెరవేరింది. బ్రహ్మనిష్టాగరిష్టుడైన వసిష్టుని చేతనే ‘బ్రహ్మర్షీ’ అని పిలిపించుకున్నాడు. తాను ఎప్పుడైతే క్రోధము, మాత్సర్యము జయించ గలిగాడో అప్పుడే బ్రహ్మర్షి పదానికి అర్హత సంపాదించానని గ్రహించ గలిగాడు.
ప్రశ్నలు:
- విశ్వామిత్రుడు రాజుగా ఉన్నప్పుడు వసిష్ఠుని పై ఎందుకు అసూయ పడ్డాడు?
- ఆయన తపశ్శక్తి ఎందుకు నశించింది?
- విశ్వామిత్రుని లో మార్పు ఎలా వచ్చింది?
- బ్రహ్మర్షి అని ఎప్పుడు పిలువబడ్డాడు?