అద్వేష్టా-వివరణ
అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ ।
నిర్మమో నిరహంకారః సమదుఃఖసుఖః క్షమీ ।।
ఎవరైతే ఎవరినీ ద్వేషించడో, ఎవరైతే అందరితో దయతో, మైత్రి భావముతో మెలుగుతాడో, మమకార- అహంకారములు లేకుండా ఉంటాడో, సుఖదుఃఖములలో సమస్థితిలో వ్యవహరిస్తాడో, క్షమాగుణమును కలిగి ఉంటాడో.
ఎవరి యందూ ద్వేషమును కలిగి ఉండరాదు. దుర్భావములు, రాగద్వేషములు లేకుండా అందరి పట్ల స్నేహభావము మరియు కరుణ, దయ కలిగి ఉండాలి. మమకార అహంకారహితులుగా ఉండాలి. సుఖదుఃఖములందు సమతృప్తిని, సమస్థితిని, సమదృష్టిని కనపరచాలి. క్షమతో నిండి ఉండాలి.
‘ఈశ్వరస్ సర్వభూతానాం…
భగవంతుడు హృదయవాసి అని భగవద్గీత తెలుపుతుంది. ఈ భావన కలిగి ఉన్నట్లయితే/ దీనిని అర్థం చేసుకున్నట్లయితే ఎవరి పట్లా ద్వేషమును ప్రదర్శించలేము. అందరికీ స్వార్థరహితమైన స్నేహితుడిగా మారుతారు. దయ, ప్రవృత్తిగా మారుతుంది. జ్ఞానోదయమైన భక్తునకు దేహాభిమానము ఉండదు. అందువలన ఎటువంటి పరిస్థితులలోనైనా ఇది సుఖము, ఇది దుఃఖము అని తలంచక సమాన బుద్ధిని కలిగి ఉంటాడు. అతనికి ఇష్ట-అయిష్టములు ఉండవు. అందరి పట్ల నిస్వార్ధమైన ప్రేమను కలిగి ఉండి, క్షమా గుణముతో ప్రవర్తిస్తారు.
పూర్వము, పై శ్లోకం అద్వేష్టా సర్వభూతానాం …..లో తెలిపిన గుణములు కలిగిన ఒక గొప్ప భక్తుడు గురువాయూరప్ప అని ఉన్నాడు. ఒకానొక సమయమున అతను, తన కుమారుని జన్మదిన వేడుకను జరుపుటకు గురువాయూర్ వచ్చాడు. అందరూ ఈ వేడుక సన్నాహములలో, ఆలయ నిర్వహణ కార్యక్రమములలో మునిగి ఉన్నారు. భోజనము సిద్ధమైనది. అప్పుడు చాలాసేపటి నుంచి పిల్లవాడు కనిపించుటలేదు అని స్మరణకు వచ్చింది. ఆ సమయంలో పిల్లవాడు ప్రాకుతూ, వంటశాలలోకి ప్రవేశించి, అక్కడ మరుగుతున్న గంజిలో పడిపోయి మృతి చెందాడు. ఆ వార్త విన్న పూంథానం, శోకమునకు గురి అయినా, ఆత్మ జ్ఞాని గనుక వెంటనే తెప్పరిల్లి, తనను తాను నియంత్రించుకుని, సమస్థితిలో సమ భావనతో వ్యవహరించాడు. కొన్ని నెలల పిదప భగవంతుడు అతనికి ఒక కుమారుని ప్రసాదింపతలచాడు. అప్పుడు ఆ భక్తుడు ఇలా పలికాడు, “మృత్యువునకు అతీతుడైన, శాశ్వతమైన నీ వంటి కుమారుడు నాకుండగా, అశాశ్వతమైన, ఎప్పటికైనా నన్ను వదిలి వెళ్ళిపోయే పుత్రుడు నాకెందుకు?”.
నిర్మమమః
మానవుని ఆలోచనలందు “నేను, నాది” అన్నది తొలగి, “నీది-నీవు” అన్న భావన పెంపొందినప్పుడు, భగవంతుని సర్వత్రా దర్శించగలిగి, ఏకత్వమును అనుభవిస్తాడు.
S S S X.
నిరహంకారః
“నేను” అని అనుకోవటం. నేను – బ్రహ్మము ఒక్కటే అని తెలుసుకొనక, అధికారము-శక్తి -సంపద-భోగభాగ్యములు నాది అని తలంచుట. నేను ఈ దేహమును అనే తలంపును సాధన ద్వారా అధిగమించవలెను.
సమ దుఃఖ సుఖః
శీతోష్ణములందు, కరువు కాటకములందు, వరదలందు, తుఫానులు, వ్యాధులందు మొదలైన అన్నిటియందు భగవంతుని సౌందర్యమును/ బ్రహ్మము యొక్క సౌందర్యమును అనుభవించినట్లయితే దానిని ప్రాకృతిక సమత్వం అని, అదే దూషణ-భూషణ,, రాగాద్వేషములు, సత్కార-ఛీత్కారములు, ఐశ్వర్య- దరిద్రము నందు అనుభవించినట్లయితే దానిని సామాజిక సమత్వం అని, అదే అక్షర నిరక్షరాస్యులు, ఆస్తిక నాస్తికులు, సత్ దుష్కర్మల ఫలితములందు అనుభవించినట్లయితే దానిని కర్మ సమత్వం అని అంటారు.
13వ శ్లోకంలో మువ్వగోపాలుడు భగవంతునికి ప్రియమైన వాని లక్షణములను, అర్జునునికి వివరించాడు.
నిజమైన భక్తుని మరియు పరిపూర్ణమైన మానవుని (లక్షణములను) కృష్ణ భగవానుడు తన మాటలలో చిత్రీకరించాడు.
అద్వేష్టా సర్వభూతానాం
ఎవరైతే అందరిలో ఉండు ఆత్మ ఒక్కటే, తను దానికి భిన్నమైనటువంటి వాడు కాదు అని తెలుసుకుంటారో, వారు ఎవరినీ ద్వేషించలేరు. ఎందుకంటే తనకంటే భిన్నమైన వారు ఎవరూ లేరు.
ఎవరూ తన చేతిని ద్వేషించలేరు, ఎందుకంటే అది తనలో భాగమే కనుక.
అతను అందరి పట్ల మైత్రితో మెలుగుతూ, దయను స్వభావముగా కలిగి ఉంటాడు. దీనులకు తనకున్నది సమర్పిస్తాడు. దేనినీ నాది అని తలంచక, అహంకార రహితునిగా వ్యవహరిస్తాడు. తనకున్న దానితో ఎదుటివారికి సహాయపడే క్రమంలో/ అందించే క్రమములో ఎదురయ్యేటువంటి అహంకారం కూడా ఉండదు. ఈ క్రమములో కష్ట నష్టములకు గురి అయినా, తన యొక్క సంపదను త్యాగము చేయవలసి వచ్చినా బాధపడడు. పొగడ్తలకు పొంగిపోడు. సుఖదుఃఖములందు సమభావమును/ సమస్థితిని కలిగి ఉంటాడు.
ఒక్కొక్కసారి అటువంటి దైవిక భావములు కలిగిన, నిస్వార్ధమైనటువంటి మానవులు నిష్కారణమైన క్రూరత్వమునకు గురి అవుతారు. అయినప్పటికీ అన్నింటినీ ఓర్పుతో సహించి, అందరినీ క్షమిస్తారు. మనందరికీ తెలుసు జీసస్ ను అకారణముగా శిలువ వేసి, చిత్రహింసలకు గురి చేసినప్పటికీ సహించి, చలించకుండా సమదృష్టితో అందరినీ క్షమించివేసెను.
13వ శ్లోకంలో కృష్ణ భగవానుడు నిజమైన భక్తునిగా మారుటకు మార్గమును నిర్దేశించారు. ఒక్కొక్కసారి దయలేనటువంటి, మర్యాద లేని, అప్రియమైన వారి పట్ల ప్రేమ చూపించటం కష్టంగా ఉంటుంది. కానీ వారి ప్రవర్తన లోని మానవత అనే అంశమును, అందరిలో ఉండు దైవత్వమును గుర్తించటం నేర్చుకోవాలి.
అందరికీ, అన్నింటికీ సత్య ప్రమాణం భగవంతుడు. ఈ సత్యమును ఎరుగుట అన్ని సద్గుణములకు, సుశీలతకు ఆధారము. ఈ సత్యము మన హృదయములో హత్తుకున్నప్పుడు, ముద్రించబడినప్పుడు భిన్నత్వము మరుగున పడుతుంది. భయము, అసూయ, ద్వేషము అన్నీ తొలగిపోతాయి. అంతటా ఉన్నటువంటి ఆత్మ ఒక్కటే అయినప్పుడు ఎవరు ఎవరిని ద్వేషిస్తారు? ద్వేషించడానికి నీవు ఎవరు?. భగవాన్ బాబా చెబుతారు “చూచేటువంటి అన్నింటిలో అందరినీ దర్శించు” అని. ఈ చరణము Brotherhood of Man, Fatherhood of God (మానవ సౌబ్రాతృత్వం, దైవ పితృత్వం)ను వర్ణిస్తుంది..
అహంకారము దైవత్వమును మరుగుపరిచేటువంటి దేహం యొక్క తెర, ముసుగు, అచ్ఛాదనము. ఎప్పుడైతే ఈ చిన్న “నేను” (I) తొలగుతుందో, విశ్వవ్యాప్తమైన “నేను” (I) ను దర్శించగలము.
ద్వేషము లేకుండా ఉండుట ఒక్కటే సరికాదు. ఈ లోకంలో కర్కశహృదయులు ఉన్నప్పటికీ, వారు ద్వేషమును కలిగి ఉండకపోవచ్చు. నిజమైన భక్తుడు ఇతరుల పట్ల ప్రేమ, సేవాభావము కలిగి ఉంటాడు. వారి ఆనందమును తన ఆనందముగా భావిస్తాడు. ఈ ఆధునిక యుగములో దీనుల, పేదల, నిస్సహాయుల పట్ల నిస్వార్ధముగా సేవనందించు అటువంటివారు ఎందరో కలరు.
ఉదా: మదర్ థెరీసా బాబా ఆమ్టే మొదలైన వారు మానవసేవకు అంకితమైనవారు. వీరు దయ, కరుణ కలిగినవారై, తోటి వారి కష్ట దుఃఖములను అర్థం చేసుకుంటారు.
కథ
మహనీయుడు/ సత్పురుషుడు ఏకనాథుడు
ఏకనాథుడు కోపమును జయించిన/ క్రోధమును జయించిన గొప్ప సాధుపుంగవుడు. ఏకనాథుని కీర్తి ప్రతిష్టలకు అసూయపడి, అతనంటే గిట్టని ఒక ధనికుడు ఉండేవాడు. ఎవరైతే ఏకనాథునికి కోపం తెప్పించగలరో, వారికి 500 రూపాయలు బహుమానముగా ఇస్తానని ప్రకటించాడు. ఒక దుష్టుడు ఈ పందెమునకు/ సవాలునకు అంగీకరించాడు. ఈ దుష్టుడు, ఏకనాథుడు గోదావరి నదిలో స్నానము చేసి, తిరిగి వస్తున్నప్పుడు ఏకనాథుని ముఖముపై ఉమ్మి వేశాడు. మహనీయుడైన ఏకనాథుడు తిరిగి వెనక్కి వెళ్లి, గోదావరిలో మరలా స్నానం చేశాడు. ఆ దుష్టుడు మళ్లీ ఏకనాథుని ముఖముపై ఉమ్మి వేశాడు. ఏకనాథుడు మరలా నదిలోనికి వెళ్లి స్నానం చేసి తిరిగి వచ్చాడు. ఈ విధంగా ఆ దుష్టుడు ఉమ్మి వేయటం, ఏకనాథుడు సంతోషంగా వెళ్లి స్నానం చేసి రావటం 108 సార్లు జరిగింది.
దీనితో ఆ దుష్టునిలో పరివర్తన కలిగి, ఏకనాథుని పాదములపై పడి క్షమాపణ వేడాడు. ఏకనాథుడు అందరిలో భగవంతుని దర్శించగలిగిన మహనీయుడు. చేతులు జోడించి అతనితో ఇలా పలికాడు “ఓ పాండురంగా! నీవు, ఎంత దయామయుడువయ్యా! ఒక్కసారి స్నానం చేసి రావటానికి బద్ధకించిన నన్ను 108 సార్లు స్నానం చేయించావు. తల్లి, తండ్రి, దైవముగా ఈ రూపంలో వచ్చి నన్ను పరీక్షించినందుకు ధన్యవాదములు”.
ఈ పలుకులతో అతనిలోని అంతరాత్మ మేలుకొని, చిన్న పిల్లవాని వలె ఏకనాథుని ఒడిలో దుఃఖించాడు. అయ్యో! నేను ఎంత పాపాత్ముడిని. నా యొక్క తప్పును క్షమించండి. ఆ ధనవంతుడు ప్రకటించిన 500 రూపాయలకు ఆశపడి మీకు కోపం తెప్పించాలని ప్రయత్నించాను. మీరు నిజమైన సాధువులు అని అన్నాడు. దానికి ఏకనాథుడు చిరునవ్వుతో ” “నాయనా! నేను కోపం తెచ్చుకుంటే నీకు ధనం లభిస్తుందని నాకు ముందే ఎందుకు చెప్పలేదు? అలా చెప్పి ఉన్నట్లయితే నేను కోపం వచ్చినట్లు నటించే వాడిని కదా. నీకూ కొంత పైకము లభించేది” అని పలికాడు. కానీ తర్వాత ఈ నూతన భక్తునికి, భగవంతుని నామము మరియు సాధుసాంగత్యములే నిజమైన ధనము అని ప్రబోధించాడు.
ప్రశ్నలు:
- కృష్ణ భగవానుడు చెప్పినట్లుగా నిజమైన భక్తుడు ఎవరు?
- నిజమైన స్నేహం అంటే ఏమిటి ? త్యాగము అంటే ఏమిటి ?
- గర్వము మరియు అహంకారము మానవుని పతనానికి దారితీస్తాయి? ఎలా?
- సమస్థితి కలిగి ఉండటం అనగా…
- (క్షమించగలిగినవాడే బలవంతుడు) బలవంతుడే క్షమించగలడు-చర్చ
- పరిపూర్ణ మానవునికి/ ఉత్తమ మానవునికి ఉండవలసిన లక్షణములు..
- దుఃఖమునకు సుఖమునకు కారకములు ఏవి?
- నిజమైన భక్తునికి ఉండవలసిన లక్షణములు ఏవి?
- దయ మరియు ప్రేమ అంటే ఏమిటి? మహనీయుల జీవితము నుంచి వీనిని నిరూపించు ఒక ఘట్టమును తెలుపుము?
- హృదయమునందు గర్వము మరియు అహంకారం ఉండిన భగవంతుడు ఉండడు– చర్చింపుము.
- అందరినీ ప్రేమించు అందరినీ సేవించు అన్నది మన సాయి యొక్క సందేశము- వివరింపుము