మార్గదర్శక దృశ్య రూపము

Print Friendly, PDF & Email
పిల్లలూ!

మీరంతా మౌనంగా, ప్రశాంతంగా, నిటారుగా కూర్చోండి. ఈ ఉచ్చ్వాస నిశ్వాసలను “ సాక్షి” వలే వుండి గమనించండి. ఒక్కసారి క్రమబద్ధంగా దీర్ఘంగా శ్వాస లోపలికి తీసుకుని బయటకు వదలండి. ఈ స్థితిని మీరు సాధన చేసినయెడల నిశ్చలంగా వున్న జ్యోతిని చూడగలుగుతారు. ఈ జ్యోతి మీకు జ్ఞానాన్ని, తెలివితేటలను వృద్ధి చేస్తుంది.

నెమ్మదిగా మీ పాల భాగము లోనికి ప్రవేశింప చేయండి.ఆ జ్యోతి వెలుగు బంగారు కిరణాలను కలిగి ఉండి మీలో ప్రేమను, మంచితనాన్ని వ్యాపింప చేస్తుంది. ఆ జ్యోతి మీ శిరోభాగం అంతా తిరుగుతూ మీ మెదడును తాకి బుద్ధిని ప్రకాశింప చేస్తున్నట్లుగా భావించండి.

ఇప్పుడు ఆ జ్యోతి మీ కంఠం ద్వారా క్రింది వైపుగా పయనింప చేసి మీ శరీరం మధ్య భాగంలోని ఆధ్యాత్మిక హృదయం వైపు పయనింప చేయండి. ఆధ్యాత్మిక హృదయ స్థానం తామర పువ్వు ఆకారంలో ఉండి ఆ జ్యోతి వెలుగుతో నిండి ఉంటుంది. ఆ జ్యోతి వెలుగు యొక్క ప్రకాశానికి తామర పువ్వు యొక్క ఒక్కొక్క రేకు విచ్చుకుంటుంది. ఆ విప్పారిన తామర పువ్వు మధ్యలో జ్యోతి నిలిచి ఉంది. క్రమేపీ ఆ తామర పువ్వు కనుమరుగై, మీ శరీరం మధ్యలో పవిత్రమైన ఆ జ్యోతి జ్ఞాన కిరణాలను ప్రసరింపచేస్తోంది.

ఆ జ్యోతి హృదయము నుండి కదిలి శరీరములోని అన్ని అంగాలకు వెలుగును అందిస్తుంది. ముందుగా కంఠం ద్వారా ఆ జ్యోతి మీ నేత్రాల లోనికి ప్రవేశిస్తుంది. అప్పుడు మీరు చూసేదంతా భగవత్ స్వరూపంగా కనపడుతుంది. అనగా మీ చుట్టూ ఉన్నదంతా మంచియే. ఇప్పుడు ఆ జ్యోతి మీ చెవులలో ప్రవేశించింది. ఇప్పుడు మీరు మంచి విషయాలను, ఆనందకరమైన మాటలను, దివ్యమైన నాదాన్ని మాత్రమే వినగలుగుతారు. ఇతరమైన చెడు మాటలను, విమర్శలను వినలేరు. భగవాన్ బాబా వారు “మంచినే చూడు, చెడు చూడకు. మంచినే విను, చెడు వినకు. మంచినే మాట్లాడు, చెడు మాట్లాడకు. మంచినే ఆలోచించు, చెడు ఆలోచించకు” అంటారు. క్రమేపీ ఆ జ్యోతిని మీ నాలుక పైకి ప్రసరింప చేయండి. అది మీ నాలుకను పవిత్రం చేస్తుంది. అప్పుడు మీరు మృదువైన, ప్రేమపూర్వకమైన మాటలను మాత్రమే మాట్లాడగలుగుతారు. మీ నాలుకతో భగవంతుని గుణగణాలనే కీర్తిస్తారు. అంతేకాక మంచి ఆహారాన్ని స్వీకరించి శక్తి వంతులవుతారు.

క్రమంగా జ్యోతిని మీ చేతుల లోనికి, వేళ్ళ లోనికి, వేళ్ళ అంచు చివరి వరకు పయనింప చేయండి. అదేవిధంగా రెండు కాళ్ళ కి, కాలి వేళ్ల చివరి అంచుల వరకు పయనింప చేయండి. ఇప్పుడు మీ చేతులు దివ్యమైన పనులనే చేస్తాయి. మీ కాళ్ళు మంచి మార్గాన్ని అనుసరిస్తాయి. ఇప్పుడు జ్యోతిని మెల్లగా వెనక్కి తీసుకుని తిరిగి మీ ఆధ్యాత్మిక హృదయ స్థానానికి చేర్చండి. అక్కడ ఆ జ్యోతిని అలాగే కొద్ది సేపు ఉంచండి. పవిత్రమైన ఆ జ్యోతి మీకు ప్రేమను పంచుతూ, జ్ఞానాన్ని పెంపొందించుతుంది. ఇప్పుడు మీ శరీరమంతా జ్యోతి వెలుగుతో నిండి ఉంది. ఈ సాధన మీలో చిదానందాన్ని కలిగిస్తుంది. “ఇప్పుడు మీరు ఆ దివ్యకాంతి లో ఉన్నారు. ఆ దివ్య కాంతి మీలో ఉంది”

ఇప్పుడు మీ లోని ఆ దివ్యశక్తి కిరణాలను బయటి వైపుకు వ్యాపింప చేయండి. ప్రేమను, శక్తిని అందరికీ పంచండి. ఆ ప్రేమ తరంగాలు మీ తల్లి, తండ్రి, సోదరి, సోదరులకు, కుటుంబ సభ్యులకు, బంధువులకు, స్నేహితులకు, సంఘంలోని ఇతరులకు అందరికీ వ్యాపింప చేయండి. మీతో శత్రు భావన ఉన్న వారికి వ్యాపింపజేసినచో, వారు మీతో మిత్ర భావనను పెంపొందించుకుంటారు. ఆ దివ్య జ్యోతిని సమస్త లోకాలకు వ్యాపింప చేయండి. ఇప్పుడు ఆ జ్యోతి లో నుండి ప్రసరించే ప్రేమతరంగాలు సృష్టి అంతా వ్యాపిస్తాయి. “ఇప్పుడు మీరు జ్యోతి ఒకటై పోయి ఉన్నారు”
నెమ్మదిగా ఆ దివ్య జ్యోతిని వెనకకు పయనింప చేసి, మీ హృదయ స్థానంలో నింపుకొని బ్రహ్మానంద స్థితిని అనుభవించండి.

ఇప్పుడు మీ రెండు అరచేతులు నమస్కార ముద్రలో ఉంచి, చేతులను కొంచెం రాపిడి చేసుకుని, ఆ చేతులను మూసి ఉన్న కన్నుల పై ఉంచుకుని, కన్నుల పై సున్నితంగా రాసుకుని మెల్లగా కళ్లు తెరవండి. పిల్లలు ఈ జ్యోతి ధ్యానము ఆస్వాదించి, క్రమం తప్పకుండా చేసినచో, మంచి శక్తిని, ప్రశాంతతను పొందుతారు. కనుక ఈ సాధనను వారు పరీక్షవ్రాసే ముందు, నిద్రించేముందు చేయమని చెప్పండి.

  • అసతోమా సద్గమయ
  • తమసోమా జ్యోతిర్గమయ
  • మృత్యోర్మా అమృతంగమయ
  • ఓం శాంతిః శాంతిః శాంతిః
జై సాయిరాం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *