యోగక్షేమం వహామ్యహం

Print Friendly, PDF & Email
యోగక్షేమం వహామ్యహం

యోగక్షేమమును చూచుకొందును అన్న భగవంతుని అభయమును, పరమాత్మ వాక్యమును సరిగ్గా అర్థము చేసుకోలేకపోతున్నారు. పండితుని మొదలు పామరుని వరకూ ఈ గీతా వాక్యమున ఇమిడి ఉన్న సరైన అర్థమును తెలుసుకొనుట లేదు.

ఒక మహారాజు సన్నిధిని మహా పండితోత్తముడు గీతా ప్రవచనము జరుపుచుండెడివాడు. ఒక దినమున ఈ పవిత్ర శ్లోకము గురించి వివరించవలసి వచ్చినది.

  • అనన్యాశ్చింతయంతో మాం యే జనాః పర్యుపాసతే।
  • తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్।।

అనేక విధముల అర్థమును తెలుపుచుండెను. అది విన్న రాజు పండితుడు చెప్పు అర్థములను ఒప్పుకొనక, దీనికిది సరికాదు అని వారించుచు వచ్చుచుండెను. పాపము! దీనికి పూర్వము అనేక రాజుల దగ్గర గొప్ప, గొప్ప బిరుదులు పొంది, గొప్ప విద్వాంసుడని పేరు పొంది ఉండుటచే, తన ప్రసంగమును రాజు ఒప్పుకొనక, ఈ శ్లోకమునకు అర్థము సరిగా చెప్పుట లేదని సభలో వాదించుట, పండితునకు తల తీసినంతటి అవమానమైనది. అంతటితో పండితుడు తిరిగి బాగుగా ఆలోచించి, ధైర్యమును కూడ తీసుకొని, యోగమను పదమునకు, క్షేమమును పదమునకు నానార్థములు ఉదాహరణములతో అందించెను. కానీ అందునకు కూడా రాజు అంగీకరించక, “ఈ శ్లోకమునకు నీవు చక్కగా అర్థము తెలుసుకొని, రేపటి దినము రమ్ము” అని తెలిపి లేచిపోయెను.

దీనితో పండితునకు ఉన్న ధైర్యము కూడా క్రిందకి దిగజారి, విచారముతో, ఘోరమైన అవమానముతో, గ్రంథము చంకన పెట్టి, ఇల్లు చేరి గీతా గ్రంథమును ఒక చోట నుంచి మంచము పై కూలెను. ఇది చూచి ఆ పండితుని భార్య, “ఏమి ఏమి ఈనాడు మీరు ఇంతటి విచారముతో ఇల్లు చేరితిరి, ఏమి జరిగినది?” అని అనేక విధముల ప్రశ్నల వర్షము కురిపించినది. దానికి పండితుడు తనకు జరిగిన అవమానము గురించి, రాజు అడిగిన జవాబుల గురించి తెలిపెను.

అన్నియూ విన్న ఇల్లాలు చక్కగా ఆలోచించి, “నిజమే! మీరు చెప్పిన జవాబు సరి అయినది కాదు. రాజు ఎట్లు ఒప్పుకొనును? మీదే తప్పు”, అని ధైర్యముగా పండితునితో పలికినది. అంతటితో పండితుడు తోక పాము వలె మంచము నుండి లేచి, “నీకేమీ తెలియును? ఇంటిలో వంటలు వండుకొను ఆడుదానికి తెలిసిన అర్థము నాకు తెలియలేదనియా? నోరు మూసుకుని పొమ్ము” అని గర్జించాడు.

అంతటితో ఆ ఇల్లాలు బెదరుకొనక “నాథా! సత్యము చెప్పిన, ఎందుకు మీకు ఇంతటి కోపము? ఆ శ్లోకమును మీరే మరొకతూరి చెప్పి చూడుడు, చక్కగా ఆలోచించి అర్థము తెలుసుకొనిన మీకు తెలియగలదు సత్యము” అని నిదానముగా అతని మనస్సును శాంతింపచేయుచూ సంభాషించెను.

తిరిగి ఆ పండితుడు “అనన్యాశ్చింతయంతో మాం…”, అని ప్రారంభించి ఒక్కొక్క పదమునకూ విడివిడిగా అర్థము చెప్పుచూ వచ్చెను. అది విని అతని ఇల్లాలు నవ్వి, “నాథా! కేవలము పదములకు అర్థములు చెప్పుట నేర్చుకొనిన వచ్చు ఫలమేమి? అసలు మీరు రాజు దగ్గరకు వెళ్లిన కారణము తెలుపుము. ఏ నిమిత్తమై మీరు రాజును ఆశ్రయించితిరి ?” అని ప్రశ్నించెను. అందులకు పండితుడు “సంసారము జరుగనక్కరలేదా! మన తిండి, తీర్థములు, గుడ్డ, గూసా ఎక్కడినుండి తేగలను? ఈ సంసార సంరక్షణార్థమై అతనిని ఆశ్రయించితిని కానీ, లేకున్న అతనితో నాకు పనేమున్నది?” అని కసరుకొనెను.

అది విన్న ఆ ధర్మపత్ని, నాథా! ఈ శ్లోకమున కృష్ణ పరమాత్మ ఏమి చెప్పెనో మీరు సరిగ్గా అర్థము తెలుసుకొనియుండిన, మీరు రాజు చెంతకు పోయి ఉండెడివారు కాదు. అనన్య చింతనతో, తనను ఉపాసించిన, తననే శరణుజొచ్చిన, నిత్యమూ తన యందే మనస్సును లగ్నము చేసిన, అట్టి వారి యోగక్షేమములు తానే చూచుకొందునని ఈ శ్లోకములో పరమాత్ముడే చెప్పియుండగా, మీరు ఈ మూడింటిని చేయక, మీ యోగక్షేమములు రాజు చూడవలయునని అతని చెంతకు వెళ్ళుట ఈ శ్లోకమునకు ఎంత విరుద్ధ అర్థమో మీరే యోచించుడు. అందుకనే రాజు మీ అర్ధమును అంగీకరించలేదు’ అని ఆ ఇల్లాలు చెప్పగా, ఆ పేరు మ్రోగిన పండితుడు కొంత యోచించి తన తప్పును తాను అర్థము చేసుకొని, మరుసటి దినము రాజు గారి ఆస్థానమునకు వెళ్లక, ఇంటిలో కృష్ణారాధనలో మునిగియుండెను. రాజు విచారించగా పండితుడు రాలేదని నౌకరులు తెలిపిరి. కారణము తెలుసుకొనుటకు రాజు మరొక నౌకరును పండితుని ఇంటికి పంపగా, పండితుడు నేను ఎవరి దగ్గరకు రానక్కరలేదు. కృష్ణుడే నా యోగక్షేమమును చూచుకొనును. ఇంతకాలమూ తెలుసుకొనలేక, కేవలము పదముల అర్థములపై మాత్రమే ప్రయాణము చేయుటచే నాకీ పరాభవము ప్రాప్తించెను. పరమాత్మునే శరణు చొచ్చి, అన్యచింతలకు చోటివ్వక నిరంతరము తన ఆరాధనలో మునిగియుండిన, నా సర్వస్వము తానే చూచుకొనును” అని తెలిపి పంపుట చూచి, రాజు ఆనందించి తానే పండితుని ఇంటికి వచ్చి, పండితునికి నమస్కరించి,” స్వామీ!, నిన్నటి శ్లోకమునకు అర్థము, నేడు మీరు అనుభవరూపమున తెలిసినందుకు నా హృదయపూర్వక నమస్కారములు” అని తెలిపి, అనుభవరూపమున లేని ప్రచారము ఆడంబర విశ్వాసమే కానీ అది అసలు స్వరూపము కాదను సత్యము వెల్లడిచేసెను.

[Adopted from ‘Chinna Katha Volume 1 – P90’]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *