భగవద్గీత పదునెనిమిది అధ్యాయములతో కూడి ఉన్నది. ప్రతి అధ్యాయమునకు ‘యోగము’ అని పేరు. యోగము అనగా ‘జీవాత్మ పరమాత్మల యొక్క ఐక్యత’ ’భగవంతుని చేర్చు మార్గము”.(భగవంతునితో సంయోగము) గీతలో ఉన్నది ప్రతి అధ్యాయము మానవుల ఉన్నతికై, పరిపూర్ణత కొరకై నిర్దేశించబడినది అని చెప్పవచ్చు. గీత అనునది ‘సార్వత్రిక గ్రంథము’. కనుక ప్రతి ఒక్కరికీ అనగా ఏ మతమునకు చెందిన వారి కైనను మానసిక మరియు ఆధ్యాత్మిక అభివృద్ధికై సందేశాన్ని అందిస్తుంది. ఇది ప్రతి ఒక్కరి నైతిక స్థితిని, మేధో స్థితిని మరియు ఆధ్యాత్మిక స్థితిని మెరుగు పరుస్తుంది. భారత ఇతిహాసమైన మహాభారతంలోని కౌరవ పాండవ యుద్ధము వాస్తవంగా ప్రతి జీవి యొక్క హృదయాంతరాళమున ప్రతి దినము జరుగుతున్న ధర్మాధర్మ పోరాటమే. గీతలో భగవంతుడు మనకు న్యాయముతో, విశ్వాసముతో, నిబద్ధతతో జీవించే నేర్పు కలిగి ఉండాలని బోధిస్తున్నారు. అంతేకాక ప్రతివ్యక్తి క్రమశిక్షణతో, అంకితభావముతో, కర్మఫలత్యాగ బుద్ధితో కర్తవ్యాలను నిర్వర్తించాలని బోధించారు. మరియు అన్ని జీవులలోని ఏకాత్మ భావాన్ని గుర్తించి, అందరిలో భగవంతుని ఉనికిని గుర్తించటానికి కృషి చేయమని తెలిపారు. మహాభారత యుద్ధమైన కౌరవ, పాండవ సంగ్రామంలో కౌరవులను అసురీ శక్తులు గానూ మరియు పాండవులను దైవీ శక్తులుగాను సూచిస్తారు. (మానవ హృదయంలో మంచి చెడుల మధ్య నిరంతరం జరిగే పోరాటమే).
దుర్మార్గులైన కౌరవుల తండ్రియగు ధృతరాష్ట్రుడు అంధుడు. అతడు శారీరకంగా మాత్రమే కాక నైతికంగాను మరియు ఆధ్యాత్మికంగానూ కూడా అంధుడే. దుర్మార్గులైన తన కుమారులను గుడ్డిగా నమ్మి వారితో జతకట్టబడ్డాడు. కౌరవులు ‘నావారు అని, పాండు కుమారులు ‘పరాయివారు’ అని వేరుపరిచే విధంగా పక్షపాత బుద్ధిని చూపాడు. తన కుమారునిపై మమకారముతో, అతని రాజుగా చేయటం తన కర్తవ్యం అనే భావనయే అతనిని అంధుడిగా మార్చింది. “యుద్ధరంగంలో నా కుమారులు మరియు పాండు పుత్రులు ఏమి చేసిరి సంజయా?” అని “మామకాః పాండవాశ్చైవ” అని అడిగాడు. అప్పుడు సంజయుడు యుద్ధం ప్రారంభం నుండి జరిగిన విషయములన్నీ అతనికి వివరించడం ప్రారంభించాడు. యుద్ధం ప్రారంభించే ముందు అర్జునుడిని ఆవరించిన నిరాశ మరియు మానసిక ఆందోళనలు గురించి ఇలా చెప్పసాగాడు. “అర్జునుడు శత్రుపక్షంలో ఉన్న తన తండ్రులను, తాతలను, గురువులను, బంధువులను చూచి, యుద్ధం జరగటం వల్ల జరిగే పరిణామాలను ఆలోచించి దుఃఖితుడయ్యెను” అని.
“కేవలం రాజ్యం కొరకై తాను తన బంధువులతో పోరాడి వారిని చంపబోతున్నాను. తండ్రి మరణానంతరము తనను పెంచి పెద్ద చేసిన పితామహుడైన భీష్మునితో యుద్ధం చేస్తున్నాను. సొంత కొడుకు కంటే ఎక్కువగా ప్రేమించి, తనకి విలువిద్యలలోని నైపుణ్యాన్నంతా పరిపూర్ణంగా నేర్పిన పూజ్యుడు, ఆచార్యుడు అయిన ద్రోణాచార్యుల వారితో యుద్ధం చేయటానికి సంసిద్ధమై, ఆ బాణాలను వారిని చంపడానికే ప్రయోగిస్తున్నాను” అన్న భావాలు అకస్మాత్తుగా అతనిని ఆవహించి, అతని మనసును కల్లోలపరిచాయి. అతనికి బంధుమిత్రులతో కల అనుబంధం, గురువు మరియు స్నేహితులతో కల సన్నిహితత్వం అతని కర్తవ్యానికి గంతలు కట్టాయి. న్యాయం నిలబెట్టుటకై తన ప్రాణాలను సైతం వదులుకోవాలని సిద్ధపడ్డాడు. ఏది ఒప్పో, ఏది తప్పో నిర్ణయించుకోలేని స్థితిలో, మనస్తాపము చెందినవాడై, తనకు మార్గాన్ని నిర్దేశించమని భగవంతుడైన శ్రీకృష్ణ పరమాత్మను కోరుతూ, అతని పాదాలను శరణు పొందాడు. అప్పుడు భగవంతుడు అతనిని కర్తవ్యం యొక్క ఔన్నత్యాన్ని గుర్తించమని చెప్పి, జ్ఞానాన్ని ప్రసాదించాడు. భగవంతుని ఉపదేశాన్ని విన్న అర్జునుడు మేల్కొని, అతని శరీరము మరియు మనస్సు ఉత్తేజితంకాగా, తన కర్తవ్యాన్ని అంకితభావంతో నిర్వర్తించాడు. భగవంతుడు అర్జునునికి అందించిన ఈ ఉపదేశం నిజంగా విశ్వవ్యాప్త సందేశం. అన్ని కాలాలకు చెందిన మానవులకందరికీ అందించబడిన ఈ సందేశమే భగవద్గీతలో పొందుపరచబడినది. ఇది మహాభారత ఇతిహాసం లోనిది. ఇందులో 700 శ్లోకములు కలవు. ఉపనిషత్తుల సారమే ఈ భగవద్గీత. దీనిని రచించిన వారు వేద వ్యాసులవారు.