బేలూరు మఠము
అమర్ నాధ్ నుండి కలకత్తాకు తిరిగి వచ్చిన తరువాత వివేకానంద స్వామి బేలూరు మఠ నిర్మాణము ఆరంభింపచేసేను. అది కలకత్తాకు అయిదు మైళ్ళ దూరమున గంగానది పశ్చిమ తటమున కలదు. 1889 జనవరిలో సన్న్యాస శిష్యులందరు ఆ మఠమున నివసించుట ఆరంభించిరి. నివేదిత బాలికల పాఠశాల అప్పటికే ప్రారంభమయ్యేను. ఆ కాలములోన ‘ఉద్బోధన్’ అను మాసపత్రిక బెంగాలీ భాషలో ప్రచురించుట ఆరంభమయ్యేను. వివేకానందుని శిష్యులైన కేప్టెన్ సేవియర్, అతని సతీమణి, హిమాలయములలోని మాయావతి (అల్మోరా)లో అద్వైతాశ్రమమును నిర్మింపచేసిరి. ప్రబుద్ధభారతి’ అను ఆంగ్లమాసపత్రిక కూడ ప్రచురింపబడ నారంభ మయ్యెను.
Dఈ కాలమునందు స్వామి వివేకానందుడు మఠమునందలి సన్న్యాసినులకును, బ్రహ్మచారులకును “ఆత్మనో మోక్షార్థం జగత్ హితాయచ” అని ప్రబోధించుచు, వారిని గాఢమైన ఆధ్యాత్మిక జీవితమును సాధనాత్మకముగా నిర్వహించుట ద్వారా స్వీయమోక్షమును, సాటిమానవ శ్రేయస్సును సాధింపవలెనవి ఉత్సాహ పరచుచుండెను. అప్పటికి మఠమునకు సంబంధించిన కార్యకలాపములలో అహోరాత్రములు అవిశ్రాంతముగా కృషి చేయుచుండుట చేత వివేకానందుని ఆరోగ్యము శిధిలమయ్యెను. కాని, అమెరికాలోనున్న శిష్యులు మరియొకసారి తమ దేశమును దర్శింపుడని ఒత్తిడి చేయుచుండుటవలన, రెండవసారి ఆదేశమునకు ప్రయాణము చేయుటకు బయలుదేరారు.