Festival of Holi in India
హోలీ పండుగ ఫాల్గుణ మాసంలో (మార్చి – ఏప్రిల్ నెలల లో) పౌర్ణమి కి మూడు లేదా నాలుగు రోజులలో, వసంత రుతువు ప్రారంభానికి ముందు జరుపుకునే వసంత పండుగ. భారత దేశంలో వివిధ ప్రాంతాల్లో హోళీకి వివిధ పౌరాణిక కథనాలు, అర్థాలు ఉన్నాయి. అందులో హిరణ్యకశిపుడు అనే రాక్షస రాజు కు సంబంధించిన కథ అత్యంత ప్రాచుర్యం పొందింది. హిరణ్యకశ్యపుడు అని రాక్షసరాజు ప్రజలను చాలా నిరంకుశంగా పరిపాలించేవాడు. కానీ ఇతని కుమారుడైన ప్రహ్లాదుడు పుట్టుకతోనే విష్ణు భక్తిని కలిగి ఉండేవాడు. అతని విష్ణుభక్తి సహించలేని అతని తండ్రి కోపోద్రిక్తుడై విష్ణువును పూజించడం, స్మరించటం తగదని వారించాడు. హెచ్చరించాడు. మానిపించాలి అని అనేక ప్రయత్నాలు చేసి విఫలుడవటంతో కోపోద్రిక్తుడై అతన్ని చంపాలని నిర్ణయించు కున్నాడు. ఎత్తైన కొండపై నుండి త్రోసి వేయించాడు. ఏనుగు చేత త్రొక్కించాడు. కానీ ప్రతిసారీ విష్ణుమూర్తి ప్రహ్లాదుని రక్షించ సాగాడు. చివరకు హిరణ్యకశిపుడు తన సోదరి అయిన హోలికను పిలిపించాడు. ఆమెకు అగ్నిచేత కాల్చబడని వరం పొంది ఉంది. అందుచేత అన్న కోరికపై హోళిక అగ్ని లో కూర్చుని ప్రహ్లాదుని తన ఒడిలో కూర్చోబెట్టుకుంది. కానీ విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల ప్రహ్లాదుడు క్షేమంగా వుండి, హోలిక కాలిపోయింది. చివరకు విష్ణువు నర సింహావతారాన్ని దాల్చి(సగం మనిషి, సగం సింహం) హిరణ్యకశిపుని సంహరించి, ప్రహ్లాదున్ని కాపాడాడు. హిరణ్యకశ్యపుని దుర్మార్గంపై, భక్తుడైన ప్రహ్లాదుడు సాధించిన విజయంగా దీనిని పేర్కొంటారు.
ఈ నాటికి కూడా విష్ణుమూర్తి ప్రహ్లాదుని రక్షించి, హోలికను దహనం చేసిన సంఘటన జ్ఞాపకార్థం హోలీ ముందు రోజు రాత్రి కామ దహనం పేరుతో భోగి మంటలు వేస్తారు. మరుసటి రోజు అందరూ ఒకరిపై ఒకరు గులాల్ అనగా వివిధ రంగులు చల్లుకుంటూ హోలీ ఆడతారు. గులాల్ (వివిధ రంగులు) ప్రేమ, స్నేహం, సద్భావనలను తెలుపుతాయి.చెడుపై మంచి సాధించిన విజయంగా ఈ హోలీ పండుగను జరుపుకుంటారు.
సందేశము : ఆనందము, సహజీవనము.