రామునికై భరతుని ఆవేదన
భరతుడు రాత్రంతా నిద్రపోలేదు. రాముని వియోగం భరించలేక దుఃఖించాడు. రాముని పాదాల మీద ఎప్పుడు వాలు దామా అని ఆతృత పడసాగాడు.
ఉదయాన్నే భరతశతృఘ్నులు వనానికి బయలు దేరారు. వారి వెంట కౌసల్య, సుమిత్ర, వశిష్ఠుడు, సుమంతుడు, ఇతర మంత్రులు, అశేష ప్రజానీకము సైన్యము ఉన్నాయి.
రెండు రోజులు ప్రయాణము చేసి గంగానదీతీరము చేరారు. అక్కడ నిషాదరాజు గుహుడు ఈ సైన్యాన్ని చూచి, భరతుడు రామునిపై యుద్ధానికి వస్తున్నాడని భావించాడు. అదేదో తేల్చుకుందామని భరతుని వద్దకు వచ్చాడు. గుహుడు భరతుని రూపం చూచి ఆశ్చర్యపడ్డాడు. అంతా రాముని పోలికే. కాని కృశించిన శరీరంతో అలసట సూచించే ఎర్రటి కళ్ళతో, నల్లటి వస్త్రాలు ధరించి ఉన్నాడు. గుహుడు నమస్కరించగానే భరతుడు తాను రామచంద్రుని తిరిగి అయోధ్యకు తీసుకు వెళ్ళడానికి వచ్చానని చెప్పాడు. అతని మాటలోని వినయానికి, నిష్కల్మషతకు, సాత్వికతకు గుహుడు ఆశ్చర్యపోయి, భరతునికి క్షమాపణ చెప్పుకుని “రాజకుమారా! రామయ్యకు, ఆయన వంశానికి నేను సేవకుణ్ణి.
మీరు, మీపరివారము గంగానది దాటడానికి ఇప్పుడే ఏర్పాట్లు చేయిస్తాను” అన్నాడు.
భరతుని పరివారము గంగా నది దాటి, గుహుని సూచనల మేరకు వెళ్ళి, భారద్వాజమహర్షి ఆశ్రమము చేరుకున్నారు. సైన్యాన్ని కొంతదూరంలో నిలిసి పాదచారియై ఆశ్రమంలో ప్రవేశించారు. తనకు నమస్కరించిన భరత శత్రుఘ్నులను భారద్వాజుడు ఆశీర్వదించారు. భరద్వాజుడు వారిని పరీక్షించాలని “రామలక్ష్మణులు ఈ వనంలో ఎక్కడ ఉంటారు? అని మీరు ఎందుకు అడుగుతున్నారు? వారి జాడ తెలుసుకుని బంధించడానికా?” అన్నారు. ఆ మాటలకు భరతుడు ఎంతో బాధపడి “మహర్షీ నన్ను అంత నీచునిగా భావిస్తున్నారా? నేను ఇక్ష్వాకు వంశంలో జన్మించానని మరచారా?” అని వాపోయాడు. భారద్వాజుడు భరతుని ఆంతర్యం గ్రహించి, అతనిని దీవించి వారందరికి ఆ రాత్రికి ఆశ్రమంలో ఆతిధ్యం ఏర్పాటు చేశారు.
కాని రాముని మీదనే మనస్సు లగ్నమైయున్న భరతుడు విందు వినోదాలలో మనస్ఫూర్తిగా పాల్గొనలేదు.
చిత్రూటంలో సీతారామలక్ష్మణులు ఒక కుటీరాన్ని నిర్మించుకుని ప్రశాంతంగా ఉంటున్నారు. రాముడు సీతకు వనవాస శ్రమ తెలియనీయక, ప్రకృతిలోని సుఃదర దృశ్యాలను చూపిస్తూ, చక్కని పచ్చిక బయళ్ళలో విహరిస్తూ కాలం గడుపుతున్నారు.
ఒకవారు మధ్యాహ్నం వారు విశ్రమించిన తరుణంలో ఏదో కలకలం వినపడింది. మృగాలు చెల్లాచెదురుగా పరుగెడుతున్నాయి. పక్షులు గూళ్ళు వదిలి అటు ఇటు ఎగురుతున్నాయి. ఆశ్చర్యపోయిన లక్ష్మణుడు ప్రక్కన ఉన్న వృక్షం ఎక్కిచూచాడు. వెంటనే దిగివచ్చి “అన్నా! పెద్ద సైన్యం మనవైపు వస్తున్నది. ముందు మన కోసల రాజ్య పతాకం కనపడుతున్నది. బహుశా భరతుడు సింహాసనంతో తృప్తిపడక మనలను చంపడానికి సైన్యంతో వస్తునట్లున్నాడు. రానీ బుద్ధి చెప్తాను.” అంటూ లక్ష్మణుడు ఆవేశంతో ఊగి పోతున్నాడు. రాముడు తమ్ముని వీవుతట్టి “సోదరా! ఆవేశ పడకు, భరతుణ్ణి అంత హీనంగా ఊహించకు. ఇక్ష్వాకువంశ రాజకుమారులు అంత అల్పబుద్ధులు కారు. భరతునికి ఎంత భక్తి విశ్వాసాలు ఉన్నాయో నాకు తెలుసు. నీకు రాజ్యం కావాలంటే భరతుడికి చెప్పి నేను ఇప్పిస్తాను.అంతేకానీ అలా మాట్లాడకు” అన్నాడు.
లక్ష్మణుడికి రాముడి మాటలతో అవేశం తగ్గి తన తొందరపాటుకు సిగ్గుపడ్డాడు. “అన్నా! నన్ను క్షమించు” అంటూ రాముని పాదాలపై వ్రాలాడు. వారందరు భరతుని రాకకై ఆతృతతో ఎదురు చూస్తున్నారు. దూరం నుంచి భరతుని యొక్క కృశించిన శరీరము, సర్వసంగ పరిత్యాగి వలె యున్న అతని వస్త్రధారణ, దుఃఖం తో కూడిన ముఖము చూచిన రాముని హృదయం ద్రవించింది.అతడు ఇంక నిలువలేకపోయాడు. భరతుడు దగ్గరకు రాగానే రాముడు ఒక్క పరుగున వెళ్ళి తమ్ముణ్ణి కౌగలించుకున్నాడు. “సోదరా! ఆయోధ్యలో తండ్రిగారు. మాతృ మూర్తులు క్షేమమేకదా! ప్రజలందరు కుశలంగా ఉన్నారా?” అని రాముడు ప్రశ్నించాడు.
భరతుడు “అన్నా! నీవు ఇక్కడ అడవుల్లో అష్టకష్టాలు పడుతూవుంటే నేను రాజ్యం పరిపాలన చేస్తున్నాననుకుంటున్నావా? మన వంశంలో జ్యేష్ట కుమారుడే పట్టాభిషిక్తుడు కావడం సంప్రదాయము, అందుకని తిరిగి అయోధ్యకు వచ్చి రాజ్యము ఏలుకోమని తీసుకుని పోవడానికి మేమంతా వచ్చాము.మీరు ఆయోధ్య వదలిన మరునాడే తండ్రిగారు ఈ లోకం వదిలారు. తండ్రి మరణవార్త విని రాముడు మూర్ఛిల్లాడు. తేరుకున్న తర్వాత నలుగురు సోదరులు దగ్గరలో ఉన్న మందాకిని నది వద్ద దశరథుని ఆత్మశాంతికి తర్పణాలు వదిలారు. తిరిగివచ్చి అందరు కూర్చున్నారు. రాముడు “భరతా! అయోధ్య వదిలి ముతక వస్త్రాలు ధరించి ఈ వేషం లోఎందుకు వచ్చావు?” అని అడిగాడు.
“అన్నా! తండ్రిగారు, నీవు లేని ఆయోధ్యను ధర్మ దేవత కూడా విడిచి పెట్టింది. నాకు సింహాసనం ఎక్కే హక్కు లేదు. అది నీది. నీవు తిరిగివచ్చి రాజ్యం ఏలుకోమని వేడుకోవడానికి మేమంతావచ్చాము. తల్లి కైకేయి తన వలననే ఇంత అవర్ధం జరిగిందని పశ్చాత్తాపంతో కుమిలి పోతున్నది.” అన్నాడు.
దీనికి రాముడు “మీ అందరి ఆదరాభిమానాలకు కృతజ్ఞుణ్ణి. జరిగినదానికి తల్లి కైకేయినిగాని, మరెవ్వరిని గానీ నిందించవద్దు. మానవులుగా మనందరము విధికి బద్ధులము. నేను అరణ్యవాసంలో 14 ఏళ్ళు గడపాలని తండ్రిగారి కోరిక. ఆ కోరిక నెరవేరనీ, ఆయన ఆత్మ శాంతించనీ” అన్నాడు.
కాని భరతుడు పట్టుదలగా “అన్నా! నేను తిరిగి అయోధ్యకు వెళ్ళను. నాకు హక్కు లేని రాజ్యం పై నాకు మోజులేదు. నేను తమ్ముడు శత్రుఘ్నుడు, తల్లులు, మంత్రిసామంతాదులు, ప్రజలు వీరందరి కోరిక మన్నించి వచ్చి రాజ్యాన్ని ఏలుకో” అని పట్టుపట్టాడు.
కాని రాముడు మెత్తబడ లేదు. “నాయనా! భరతా! ఈ విషయంలో నా నిర్ణయం తిరుగులేనిది. పితృవాక్యాన్ని పాలించడం మన కర్తవ్యము.. రాజ్యపాలనలో నీకు శత్రుఘ్నుడు, అరణ్యవాసంలో నాకు లక్ష్మణుడు సహాయంగా ఉంటారు. కాబట్టి వెంటనే వెళ్ళి అయోధ్యను ప్రజానురంజకంగా పాలించు. అందుకు నా ఆశీస్సులు అందజేస్తున్నాను” అని ఆదేశించాడు.
భరతుడు నిశ్చలచిత్తంతో ఇలా అన్నాడు. “అన్నా! నామనస్సు మారదు, నీవు అయోధ్యకు వచ్చేవరకు ఇక్కడనే ఆమరణ నిరాహారదీక్షకు పూనుకుంటాను.”
అటు రాముడు, ఇటు భరతుడు ఇద్దరు తమ పట్టు వదలటంలేదు. పరిస్థితి విషమంగా ఉన్నదని గ్రహించిన రాజు గురువు వసిష్ఠుడు ముందుకువచ్చి “నేను మధ్యేమార్గం ఒకటి సూచిస్తాను. రామచంద్రుడు వనవాసం పూర్తి చేసి వచ్చేవరకు అతని ప్రతినిధిగా భరతుడు అయోధ్యను పాలిస్తాడు”అనగా చివరకు భరతుడు దీనికి అంగీకరించి “అయితే నాదొక విన్నపము. రామచంద్రుని పాదుకలను సింహాసనముపై ఉంచి నేను కేవలం రాజ్యవ్యవహారాలు నిర్వహిస్తాను. నగరానికి వెలుపల ఒక శిబిరంలో ఉంటాను. 14 ఏళ్ళు పూర్తి అయిన రోజు మా అన్న రాకపోతే ప్రాయోపవేశం చేస్తాను” అని ప్రతిజ్ఞ చేశాడు.
భరతుని మనోనిశ్చయానికి, భ్రాతృభక్తికి అందరు ఆశ్చర్యపోయారు.
ప్రశ్నలు :
- రాజ్యపాలనను భరతుడు ఎందుకు అంగీకరించలేదు?
- ఆయోధ్యకు తిరిగి రావడానికి రాముడు ఎందుకు అం రించలేదు?
- ఈ సమస్యను వసిష్ఠుడు ఎట్లు పరిష్కరించాడు.