వినాశకాలే విపరీత బుద్ధి
రాముడు సుగ్రీవుని సహకారంతో లంకపై దండెత్తడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఒక మహా ప్రవాహం వంటి వావర సేన దక్షిణ సముద్రం ఉత్తర తీరానికి చేరింది. ఇంతటి మహాసముద్రాన్ని ఎలా దాటడమా అని వానర వీరులు అందరు ఆలోచిస్తున్నారు.
వావర సేన రావడం చారుల ద్వారా తెలుసుకొన్న రావణుడు కొంత చలించాడు. తన మంత్రులతో ఆలోచన జరిపాడు. “ఆనాడు ఒక్క వానరుడు వచ్చి రామ దూతనని ఎంత ఆందోళన కలిగించాడో చూచారు కదా? ఇప్పుడు రాముడే స్వయంగా పెద్ద వానర సేవతో లంక మీద దండెత్తుతున్నాడు. ఇప్పుడు మీ సలహాలు ఏమన్నా ఉంటే చెప్పండి” అన్నాడు. రావణుని మనోస్థైర్యం కొంచెం సడలింది. మంత్రుల ప్రోత్సాహవచనాలతో కొంచెం ధైర్యం కూర్చు కోవాలనుకున్నాడు. రావణుని పరిస్థితి గమనించి మంత్రులు ఒక్కరొక్కరు లేచి అతని గుణగణాలను, శౌర్యాన్ని, పొగిడి “మీ ఆదేశంతో మేమందరము రాముణ్ణి, అతని సేనను నామరూపాలు లేకుండా చేస్తాము” అని ప్రజ్ఞలు పలికారు. ఈ మాటలు విని రావణుడికి ఎక్కడలేని ధైర్యం వచ్చింది. “మీ శక్తి యుక్తులునాకు తెలుసు. మీ అండ ఉండగా విజయం నాదే” అన్నాడు. కానీ రావణుని సోదరుడు విభీషణుడు మాత్రం మంత్రుల వాక్యాలతో ఏకీభవించలేదు.
“రాక్షస చక్రవర్తీ! మీ శక్తి సామర్థ్యాల పై నాకు ఎటువంటి సందేహమూ లేదు. కాని వీరి పొగడ్తలకు భ్రమ పడవద్దని మాత్రం హెచ్చరిస్తున్నాను. పరిస్థితిని గమనించక వీరు నిన్ను ఆకాశానికి ఎత్తివేస్తున్నారు. ఇటువంటి సమయంలో మనము విచక్షణతో ఆలోచించి ముందు కార్యక్రమం జరిపించాలి. ధనుర్విద్యలో రాముడు అద్వితీయుడని విన్నాను. మనము అతనితో కోరి తగవు తెచ్చుకున్నాము. ఆయన ధర్మపత్ని సీతను బందీగా ఉంచే అధికారం మీకు లేదు. మర్యాదగా ఆ మహాసాధ్విని రామునికి అప్పగించి అనవసర యుద్ధం నివారించడం మంచిదని నా అభిప్రాయము అని మీకు విన్నవించుకుంటున్నాను” అన్నాడు.
విభీషణుడు బాల్యం నుండి విష్ణు భక్తుడు. అతని గృహంలో నిత్యాగ్నిహోత్రము, దైవపూజ జరుతుంటాయి. అతడు పరమ సాత్విక స్వభావం కలవాడు. తన తమ్ముని హితవాక్కులు రావణునికి రుచించలేదు. “విభీషణా! ఆపు నీ అధిక ప్రసంగం. చేతగాని వాడవై, నా ఉన్నత స్థితిని చూచి అసూయ పడుతున్నావు.. పైగా రాజవంశంలో పుట్టి శత్రువులను మెచ్చుకుంటావా? నీవా నాకు నీతులు నేర్పేది? అంటూ గర్జించాడు. విభీషణుడు మాత్రం నొచ్చుకోక “అన్నా! నీ సోదరుడిగా వేడుకుంటున్నాను. నీవు పట్టిన మార్గము రాక్షస వంశ నాశనానికే దారి తీస్తుందని భయపడుతున్నాను. చిన్న వాడినని నా మాట తీసివేయవద్దు” అని ప్రార్ధించాడు.
కాని రావణుని అహంకారము, మదము, విభీషణుని మాటలలోని హితము గ్రహించడానికి అడ్డు వచ్చాయి. విభీషణుని మందలించి సభ చాలించి రథంలో బయలుదేరిడానికి లేచాడు. ఆ సమయంలో అతని భార్య మండోదరి “ప్రభూ, నా మనవి ఆలకించండి. సీతను రామునికి అప్పగించండి. సీత లంకకు వచ్చినప్పటినుండి ఏవో అపశకునాలు కన్పిస్తు న్నవి. సాధారణ మానవ కాంత అయిన సీతకోసం మీ కెందుకు ఈ భ్రాంతి”అని భర్త పాదాలపై పడి వేడుకుంది. రావణుడు మండోదరిని త్రోసివేసి “ ఇటువంటి అబల కన్నీళ్లు నన్ను, నాప్రయత్నాన్ని ఆపలేవు” అని ముందుకు సాగి పోయాడు.
ప్రశ్నలు:
- రావణుని మంత్రులు అతనిని ఏ విధంగా ప్రోత్సహించారు?
- విభీషణుడు, మండోదరి వీరి హిత వాక్కులను రావణుడు ఎందుకు తృణీకరించాడు?