విశ్వామిత్ర యాగరక్షణ
దశరధుని నలుగురు కుమారులైన రామ, లక్ష్మణ, భరత, శత్రువులు పెరిగి పెద్దవారవుతున్నారు. వారు అందరు బాలుర వలె కాక ఉత్తమ గుణాలను చూపించేవారు. రాముడు ఎల్లప్పుడు సత్యానికి, ధర్మానికి కట్టుబడేవాడు. లక్ష్మణుడు నిజాయితీ, సత్ప్రవర్తనతో ఉండేవాడు. భరతుడు విశాలహృదయంతో ధర్మాన్ని ఎప్పుడూ తప్పేవాడుకాడు. శతృఘ్నుడు సాత్వికుడు.దయాళువు. దశరథుడు తన కుమారులకు సమర్ధు లయిన గురువుల వద్ద యుద్ధవిద్యలతో బాటు అన్ని విద్యలూ నేర్పించాడు. ఈ విధంగా వృద్ధిలోకి వస్తున్న తన కుమారులను చూచి ఆనందంతో నిశ్చింతగా కాలం గడుపుతున్నాడు.
విశ్వామిత్రుడు “మహారాజా! ఋషులను, సజ్జనులను రక్షించుట రాజు యొక్క విధి. నేను ఒక మహాయజ్ఞాన్ని ప్రారంభించాను. కానీ రాక్షసులు దానికి ఎన్నో అడ్డంకులు కలుగ చేస్తున్నారు. ఆ రాక్షసులను శిక్షించి,నా యజ్ఞాన్ని సరిగ్గా జరిపించ దగినవాడు నీ కుమారుడు రాముడే అని నా విశ్వాసము.అందుకని రాముని నా ఆశ్రమానికి పంపమని అడగటానికి వచ్చాను” అన్నాడు.
ఈ మాట విని దశరధుని నోట మాట రాలేదు. “మహర్షీ, నా రాముడు ముక్కుపచ్చలారని పసివాడు. కావాలంటే నా సమస్త సైన్యాన్ని మీ ఆధీనంలో ఉంచుతాను. ఇంకా అవసరమైతే నేనే స్వయంగా వచ్చి మీకు సహాయంగా నిలుస్తాను. రాక్షసులను ఎదుర్కొంటాను. కానీ చిన్నవాడైన రాముని పంపాలంటే నాకు మనస్కరించడం లేదు” అన్నాడు.
ఇది విని విశ్వామిత్రుడు ఉగ్రుడై నాడు. తన ఆసనం నుండి లేచి “దశరథ మహారాజా! ఇక్ష్వాకు వంశ చక్రవర్తులు మాట తప్పుతారని నేను అనుకోలేదు. ఇక నాకు ఇక్కడ పని లేదు”అని బయలుదేరాడు.
దశరధుని రాజ పురోహితుడు వశిష్ఠుడు, ప్రమాదాన్ని శంకించి “మహారాజా! విశ్వామిత్రుడు సామాన్యుడు కాడు. ఆయన మన చిరంజీవిని పంపమన్నాడు అంటే తేలికగా తీసి వేయకూడదు. రాముని శక్తి సామర్ధ్యాలు ఆయనకు తెలిసి రాక్షస సంహారానికి, యజ్ఞ రక్షణకు వినియోగించ దలిచాడు. ఏ మాత్రం సందేహించక రాముని ఆ మహర్షి వెంట పంపండి”అని హితోక్తులు పలికాడు.
ఈ మాటలతో దశరధునికి ఉపశమనం కలిగింది. రామలక్ష్మణులను పంపడానికి వారిని సభకు తీసుకుని రమ్మని చెప్పాడు. రామలక్ష్మణులు సభ లోనికి ప్రవేశించి మొట్టమొదటిగా తల్లిదండ్రులకు నమస్కరించి, ఆ తర్వాత వశిష్టునికి, విశ్వామిత్రుల వారికి నమస్కరించారు.
దశరథుడు “నాయనలారా! మిమ్మల్ని ఇద్దరిని విశ్వామిత్ర మహర్షికి అప్పగిస్తున్నాను. ఆయన ఆజ్ఞానుసారము నడుచుకోండి” అని, విశ్వామిత్రునితో “ స్వామీ! నా ప్రాణంతో సమానంగా ఉన్న నా కుమారులను మీకు అప్పగిస్తున్నాను. వారి యోగక్షేమములు మీరే చూసుకోండి” అన్నాడు.
విశ్వామిత్రుడు, రామలక్ష్మణులు ప్రయాణం చేసి రాత్రికి సరయూ నదీతీరం చేరి అక్కడ విశ్రమించారు. ఉదయాన్నే వారిని లేపి, స్నానానంతరము వారికి ఆకలి దప్పులు, శ్రమను పోగొట్టు ‘బల అతిబల’ అను రెండు విద్యలను,సకల దివ్యాస్త్రాలను ప్రసాదించాడు. తర్వాత వారు గంగా నది దాటి దండకారణ్యం చేరుకున్నారు.
ఆ వనంలో వారిని తాటక అనే భయంకర రాక్షసి ఎదుర్కొన్నది. విశ్వామిత్రుడు “రామా! స్త్రీ అని సందేహించ వద్దు. వెంటనే దీనిని హతం చెయ్యి” అన్నాడు. వెంటనే రాముడు దివ్యాస్త్రం సంధించి తాటకను వధించాడు.
వారు క్రమంగా విశ్వామిత్రుని యాగ ప్రదేశమైన సిద్ధాశ్రమము చేరుకున్నారు. ఆ మరుసటి రోజు ఉదయాన్నే విశ్వామిత్రుడు, అనేక మంది ఋషుల సహకారంతో యజ్ఞాన్ని ప్రారంభించాడు. రామలక్ష్మణులు ధనుర్ధారులై ఆ యజ్ఞవాటిక చుట్టూ కాపలాగా తిరుగుచున్నారు. ఆ విధంగా అయిదు రోజులు గడిచిన తర్వాత ఆరవ రోజు హఠాత్తుగా ఆకాశమంతా రాక్షసులతో నిండి చీకటి కమ్ముకుంది. మారీచ, సుబాహులను దానవులిద్దరూ వారికి నాయకులుగా ఉన్నారు. వారు యఙ్ఞ వేదిక మీదికి రక్తము, మాంసము గృమ్మరించ ప్రారంభించారు. రామలక్ష్మణులు గురువుకు నమస్కరించి ఉత్సాహంతో రాక్షస సైన్యాన్ని ఎదుర్కొని నాశనం చేశారు. సుబాహుడు రామ బాణంతో అక్కడే మరణించాడు. మారీచుడు సహస్ర యోజనాల దూరానకి విసిరి వేయబడ్డాడు. విశ్వామిత్రుడు రామలక్ష్మణులను అభినందించి యాగము జయప్రదంగా పూర్తి చేసుకున్నాడు.
మరునాడు విశ్వామిత్రుడు, ఇక్ష్వాకు సోదరులను పిలిచి “నాయనలారా! మనము ఇక్కడ నుంచి బయలుదేరి మిథిలా నగరానికి వెళ్లాలి” అన్నాడు.
లక్ష్మణుడు కొంత అసహనంతో “మనము వచ్చింది యాగరక్షణకు. అది అయిపోయింది. కాబట్టి తిరిగి అయోధ్యకు వెళ్తాము” అన్నాడు. దానికి రాముడు చిరునవ్వుతో “సోదరా! మన ఇద్దరినీ తండ్రిగారు ఈ మహర్షికి అప్పగించారు. ఆయన చెప్పినట్లుగా నడుచుకోవడమే మన కర్తవ్యము” అని శాంత పరిచాడు.
విశ్వామిత్రుడు, రామలక్ష్మణులు మిథిలా నగరానికి బయలుదేరారు.
ప్రశ్నలు:
- విశ్వామిత్రుడు రాముని పంపమని అడిగినప్పుడు దశరథుడు ఏమని చెప్పాడు?
- వశిష్ఠుడు రాముని పంపమని ఎందుకు చెప్పాడు?
- సభలోకి ప్రవేశించిన రాముడు,మొదటతల్లికి,తండ్రికి తర్వాత వశిష్టులవారికి,అనంతరం విశ్వామిత్రులకు,నమస్కరించుట లోని ఆంతర్యమేమి యో తెలుపుము.