భారతీయులకు వేదాలయందు, పవిత్ర గ్రంథముల యందు, మరియు వారి జాతీయ సూక్తి యందు కూడా సత్యము ప్రధాన విలువగా పరిగణించబడినది. భారత ఇతిహాసములు, ఇతర మతపరమైన కథలు, స్వాతంత్ర్య సమరయోధుల కథలను పరిశీలిస్తే, సత్యానికి కట్టుబడి విజయాన్ని సాధించిన అనేక వ్యక్తుల యొక్క ఉదాహరణలు ఎన్నో కలవు.
వేదములు మానవుడు “జీవితంలో ఆచరించవలసిన ప్రధాన సూత్రం సత్యము” అన్నది తెలియజేస్తున్నాయి. ఒకసారి ఇంద్రుడు ప్రహ్లాదున్ని అతని శీల గుణాన్ని ఇవ్వవలసిందిగా కోరగా, దానికి అతడు అంగీకరించాడు. శీల గుణం ప్రహ్లాదున్ని వీడిన తర్వాత, వరుసగా కీర్తి, యశస్సు, ధైర్యం అతనిని విడిచి పెట్టాయి. తర్వాత సత్య గుణం అతని నుండి బయలుదేరగా ప్రహ్లాదుడు వద్దని ప్రార్థించాడు. సత్య గుణం ప్రహ్లాదుని చేరగానే కీర్తి, యశస్సు మొదలైన గుణములు తిరిగి అతని చేరాయి. దీనిబట్టి “సత్యం మిగిలిన అన్ని విలువలకు ప్రాతినిధ్యం వహిస్తున్నది” అని మనం తెలుసుకొనవచ్చు. కనుకనే బాలవికాస్ పాఠ్యాంశములలో “సత్యమే దైవము” అన్న కథను చేర్చటం జరిగింది.