ఎప్పుడైతే భగవంతుడు భూమిపై నడయాడునో అప్పుడే చెట్లు, చేమలు, జంతువులు మరియు మానవులు సర్వవ్యాపకమైన దివ్య ప్రేమలో,సంతోషములో ఓలలాడుదురు. అప్పుడు విశ్వమంతా సామరస్యపూర్వక ప్రేమ నెలకొని, అద్భుతమైన మార్పులు వ్యాప్తి చెందును. ఈ విధంగా ఎనిమిది దశాబ్దాల క్రిందట 1926 వ సంవత్సరము, పవిత్ర దినమైన నవంబర్ 23 వ తేదీన ఈ భువిపై భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారు అవతరించి, మన అందరి మధ్యలో నడయాడారు.
మన ప్రియతమ భగవానుని జననము మరియు బాల్యంలోని విశేషాలతో కూడిన కథాసంకలనమే ఈ “బాలసాయి”(Young Sai). ఇందులో బాల సాయి తమ అవతరణ ముఖ్యఉద్దేశ్య విత్తులను ఏవిధంగా నాటి ఫలప్రదం గావించారో తెలియజేయడమైనది. బాబా వారి జీవితము, వారి బోధనలను “నా జీవితమే నా సందేశము” గా ప్రకటించడమైనది.
బాలవికాస్ గురువు తమ విద్యార్థినీ విద్యార్థుల వయస్సును దృష్టిలో ఉంచుకుని బాబా వారి బాల్యంలోని సంఘటనలను ఎన్నుకొన వలసి ఉంటుంది. ఇందులో కథనాంశముల విశిష్టత, భగవంతుని జీవిత గాధలు మాత్రమే కాక, వ్యక్తిత్వ వికాసము మరియు మానవతా విలువలు వికసింప చేయునవిగా ఉండాలి. బాలవికాస్ గురువులు కథలలో అంతర్గత విలువలను విద్యార్థులకు విశదీకరించాలి. బాలవికాస్ గురువులు బోధనాంశములను విద్యార్థులు ఏ విధంగా అవగాహన చేసుకుంటున్నారో తెలుసుకొనుటకై “క్విజ్”ను నిర్వహించ వచ్చును.