సత్యాన్ని పలకటం ద్వారా, ధర్మాన్ని ఆచరించడం ద్వారా మానవుడు శాంతిని పొందగలుగుతాడు. మానవుడు శాంతియుతంగా జీవించటానికి కఠిన ప్రయత్నాలు చేయవలసిన అవసరం లేదు. సత్యానికి కట్టుబడి, ధర్మాన్ని ఆచరించుట ద్వారానే శాంతిని పొందగలుగుతాడు. శాంతియుతమైన జీవనానికి మనసును అదుపులో ఉంచుకోవటం ప్రధానం. ఎప్పుడైతే మనసును నియంత్రించగల వెళ్తాము అప్పుడు నిశ్చల స్థితిని పొంది గలుగుతాము. అట్టి నిశ్చల స్థితి నుండి పరమ శాంతిని ఉండగలుగుతాము. బాహ్యమైన ఆడంబరాల ద్వారా శాంతిని పొందలేము. ఆ విధంగా పొందే ఆనందం శాశ్వతమైనది కాదు. అది ఎండమావి లాంటిది. అంతర్గతమైన నిశ్చల శాంతి నిజమైన ఆనందాన్ని అందించగలదు. “శాంతము లేక సౌఖ్యము లేదు” త్యాగరాజస్వామి వారు కీర్తన ద్వారా ప్రపంచానికి చాటి చెప్పారు. గంధం చెట్టు తలలు నరికే గొడ్డలి కూడా సుగంధాన్ని ఏవిధంగా అందిస్తుందో, అగరబత్తి తాను కాలిపోతూ చుట్టూ పరిమళాన్ని ఏ విధంగా వెదజల్లుతుందో, అదే విధంగా సాధకుడు, నిజమైన భక్తుడు ఎట్టిపరిస్థితిలోనూ శాంతిని వీడకుండా ఆనందాన్ని ప్రసరింప చేయగలుగుతాడు. కోపాన్ని నియంత్రించడం ద్వారా అంతర్గత శత్రువులను జయించి శాంతంగా ఉండగలుగుతాడు.