ఒకరోజు ఈశ్వరమ్మ నాతో “స్వామి పుట్టపర్తి చాలా చిన్న గ్రామం. పిల్లలు పాఠశాలకు వెళ్లాలంటే చాలా దూరం నడిచి ప్రక్క గ్రామాలకు వెళ్లాల్సి వస్తోంది. దయచేసి ఒక పాఠశాలను నిర్మించండి” అని అడిగింది. ఎక్కడ నిర్మించమంటావు అని అడిగితే మన ఇంటి వెనుక భూమిలో నిర్మించాలని కోరారు. ఆమె కోరిక మేరకు పాఠశాలను నిర్మించాను.
అద్భుతంగా జరిగిన ప్రారంభోత్సవానికి విచ్చేసిన భక్త సమూహాన్ని చూసి ఆనందించిన ఆమె తన రెండవ కోరికను స్వామికి విన్నవించారు. “ప్రపంచం మొత్తం కష్టాల్లో ఉంటుంది మీరు ఆనందంగా ఉంటే అందరూ ఆనందంగా ఉంటారు కాబట్టి ఒక చిన్న ఆసుపత్రిని నిర్మించాల” ని కోరింది. అలాగే అని ఆసుపత్రిని నిర్మించాను. దాని ప్రారంభోత్సవానికి ప్రముఖులైన బెజవాడ గోపాల రెడ్డి గారిని ఆహ్వానించాను. ఈ కార్యక్రమానికి చుట్టుప్రక్కల గ్రామాల నుంచి విచ్చేసిన వేలాదిమంది ప్రజానీకాన్ని చూసి ఆమె ఆశ్చర్యపోయారు. అంత బాగా జరుగుతుందని ఈశ్వరమ్మ ఊహించలేదు.
మరుసటి రోజు నా దగ్గరకు వచ్చి “స్వామి నేను ఇప్పుడు చనిపోయిన పర్వాలేదు. మీరు నా కోరికలు తీర్చారు. గ్రామస్తుల బాధలను చాలా వరకు తగ్గించారు” అన్నారు. ఇంకా ఏమైనా కోరిక ఉంటే చెప్పమన్నాను తడబడుతూ స్వామి ఇంకొక చిన్న కోరిక ఉంది అంటూ తన మూడవ కోరికను వెల్లడించారు అది “స్వామి వర్షాకాలంలో పొంగిపోయే చిత్రవతి వేసవికాలంలో ఎండిపోతుంది. కాబట్టి కొన్ని బావులు తవ్వించండి స్వామి అన్నారు అప్పుడు చిన్న బావులతో ఆగిపోనని రాయలసీమ ప్రాంతానికి మొత్తం నీరు అందిస్తానని చెప్పాను. రాయలసీమ అంటే ఏమిటో నాకు తెలియదు. మన గ్రామానికి నీరు అందిస్తే నేను తృప్తి చెందుతాను అన్నారు.-బాబా.
శ్రీ సత్య సాయి “ఈశ్వరాంబ నందన”, “ఈశ్వరాంబ ప్రియ తనయ” మొదలైన వాటిని ఆరాధించటానికి ఇష్టపడేవారు. దివ్య మాత, దివ్య అవతారం మధ్య ఈ అందమైన సంబంధాన్ని జరుపుకునే ఈ భజనలు మనలో ఆనందాన్ని నింపుతాయి. భగవంతుని పట్ల హృదయపూర్వకమైన ప్రేమతో వాటిని పాడినప్పుడు భగవంతుని హృదయాన్ని ఆనందంతో నింపుతాయి.