దేవాలయాల్లో చర్చిల్లో అక్కడ ఇక్కడ అన్ని చోట్లా, భూమి మీద స్వర్గం లో ఎంతో పరిశోధించిన తర్వాత తిరిగి మూలానికి వచ్చిన ఆత్మ విశ్వమంతా మనం ఎవరికోసం వెతుకుతున్నామో వారిని మనం మూలం లోనే కనుగొంటాము. మీరు చర్చిలో దేవాలయంలో ఏడుస్తూ ప్రార్థన చేస్తారు. అన్నిటి కంటే రహస్యాతి రహస్యమైన వారిని దర్శించుతాం. వారికి మనం దగ్గరే ఉన్నామని తెలుసుకుంటాం. మన స్వంత వ్యక్తిత్వం, జీవితం, శరీరం, ఆత్మ యొక్క వాస్తవికత మన స్వభావము అదే అని నొక్కి చెప్పుకుని అలాగే దాన్ని వ్యక్తం కూడా చేయగలం.
అదే సత్యం, ఆ ఒక్కటే సత్యం. అతడే నిజమైన స్నేహితుడు బంధువు. సత్యానికి కట్టుబడి ధర్మాన్ని అనుసరించాలి. అప్పుడు మన శరీరంలో ఒక్క వెంట్రుక కూడా దెబ్బతినదు.
ధ్యానం అనేది కోరికలను అధిగమించడం తప్ప వేరు కాదు. త్యజించడం అంటే దుష్ట శక్తులతో పోరాడి మనసును అదుపులో ఉంచుకునే శక్తి మాత్రమే – బాబా
అరటి పళ్ళు మామిడి పళ్ళు బాగా పండాలి అంటే గడ్డితో కప్పడం లేదా మూసి ఉన్న గదిలో ఉంచితే వేడికి బాగా పండి రుచిగా ఉంటాయి.
ధ్యానం సైతం మనలో వేడి కలిగించి మనల్ని మరింతగా పక్వానికి వచ్చేలా చేసి ఇష్టంగా భగవంతుడికి మరింత ఆమోదయోగ్యంగా మార్చుతుంది అంటారు బాబా.
జపము అంటే ఎంచుకున్న భగవంతుని నామాన్ని పదే పదే నిరంతరం మానసికంగా జపించడం. తీవ్రమైన భక్తితో ఏకాగ్రతతో భగవంతుని అంశాన్ని లేదా కొన్ని అంశాలను మంత్రంతో జపించడం. భగవంతుడి నామం, మంత్రం గొప్ప శక్తిని కలిగి ఉంటాయి. అవి మనిషిని శుద్ధి చేసి, ప్రభావంతో మనిషి లోని ఆత్మను మేల్కొలుపుతాయి. జప అనే పదంలో జ కారం జనన మరణ నాశనాన్ని, ప అనే అక్షరం పాప వినాశనాన్ని సూచిస్తాయి. జకారో జన్మ నాశనాయ పకారో పాప నాశనాయ అంటారు.
ధ్యానం అంటే జపానికి మనం ఎంచుకున్న భగవంతుని పేరు ధ్యానించడం. ‘ధీ’ ‘యాన’ అనే వాటి మూలం నుంచి వచ్చిందే ధ్యానం. ధీ అంటే బుద్ధి, యాన అంటే ప్రయాణం. మన బుద్ధిని భగవంతుని వైపుకు ప్రయాణం చేయించడం. ఇది ఆధ్యాత్మిక స్పృహ లోకి అంతర్గతంగా ప్రయాణించడం.
ధ్యానానికి జపం ఒక సహాయకారి. ఇది ఒకే ఆలోచనకు మనసును స్థిరంగా ఉంచడం. మనసు నుండి ఇతర ఆలోచనలు నియంత్రించడం లేదా బహిష్కరించడం కోసం శిక్షణ. జపం పడవ చుక్కాని వంటిది ధ్యానం ఒడ్డు వంటిది. ధ్యాన శాస్త్రం వివరించడానికి భ్రమర కీటక న్యాయం అనే ఉదాహరణ ఉంది. భ్రమరం అంటే తుమ్మెద అది ఒక చిన్న పురుగును ఎత్తుకుని వచ్చి తన గూటిలో పెడుతుంది. దాని చుట్టూ పెద్ద ఝంకారం చేస్తూ తిరుగుతుంది. తుమ్మెదను చూసి భయపడి పురుగు చిన్న రంధ్రం ద్వారా దాన్నే చూస్తూ శబ్దం వింటూ దాని అసలు స్వరూపం కోల్పోయి అందమైన భ్రమరలా మారుతుంది. అదేవిధంగా మానవుడికి ఏకబిగిన భక్తి ఉంటే ఏకాగ్రతతో భగవంతుని ధ్యానిస్తే తాను మాధవుడిగా మారుతాడు అంటారు బాబా.
ఎయిర్ కండిషన్ మనకు ఉష్ణోగ్రతను తగ్గించి ఎలా చల్లదనాన్ని సౌఖ్యాన్ని ఇస్తుందో అలాగే మనం జపించే నామం కూడా మనకు మంచి లక్షణాలు, గుణాలు కలిగిస్తుంది. మనలోని జంతు లక్షణాలు తొలగించి అజ్ఞానం దూరం చేస్తుంది. మనిషి కూడా దైవమే అందుకే బాబా మనల్ని పదే పదే దివ్యాత్మ స్వరూపులారా అంటారు. నీవు దైవమని నీకు తెలియదు నాకు తెలుసు అంటారు. మనిషి తాను శరీరం అని భావించి అది బాధించేదని, అన్ని బాధలకు మూల కారణం శరీరం అనుకుంటాడు. తాను శరీరం కాదు ఆత్మ అని తెలుసుకుంటే జనన మరణ చక్రం నుండి విముక్తి చెంది అత్యున్నత ఆనంద స్వరూపుడు అవుతాడు. కానీ అటువంటి క్రమ బద్ధమైన స్థితి చేరాలంటే ఎంతో సాధన అవసరం. మనసును అన్ని కోరికల నుంచి ప్రాపంచిక విషయాల నుంచి విముక్తం చేయాలి. భగవంతుడి గురించి ఆలోచనల్లో లీనమై ఆత్మను శోధించడానికి జపం ధ్యానం తప్ప వేరు మార్గం లేదు. అన్ని ఆలోచన శక్తులను మానసిక సామర్థ్యానికి వినియోగించే ఏకైక మార్గం ధ్యానం. మనం శరీరం కాదు ఆత్మ అని తెలుసుకోవాలంటే వాటి మధ్య తేడాను గమనించాలి. భౌతిక శరీరం, ఆత్మ స్వరూపాన్ని గుర్తించాలి. ఆత్మ అనేది 5 తొడుగులతో శరీరంలో కప్పబడి ఉంటుంది. అవి _
- అన్నమయ కోశం- ఆహార భాగం
- ప్రాణమయ కోశం- ప్రాణ వాయువు భాగం
- మనోమయ కోశం- మానసిక భాగం
- విజ్ఞానమయ కోశం- మేధో సంపత్తి భాగం
- ఆనందమయ కోశం- ఆనందం కలిగించే భాగం
అన్నమయ కోశం కనిపించే స్థూల శరీరం
ఆత్మ ఈ అయిదు తొడుగుల శరీరంతో కప్పబడి ఉన్నా, అది వాటికన్నా భిన్నంగా ఉంటుంది. ఆత్మయే దైవం.
అన్నమయ కోశం కనిపించే స్థూల శరీరం
ప్రాణమయ మనోమయ కోశాలు సూక్ష్మ శరీరాన్ని ఏర్పాటు చేస్తాయి
విజ్ఞానమయ కోశం సూక్ష్మ శరీరం
ఆనందమయ కోశం కారణ శరీరం
ఈ స్థూల సూక్ష్మ కారణ శరీరాలు మూడు అవస్థలు కలిగి ఉంటాయి.
- జాగ్రదావస్థ – మేలుకుని ఉండి జ్ఞానేంద్రియాలుతో పనిచేయడం
- స్వప్నావస్థ – కలలో ఉంటూ కోరికల స్వంత ప్రపంచంలో విహరించడం
- సుషుప్తి అవస్థ – గాఢ నిద్రలో ఉండటం అనగా పూర్తి అజ్ఞానం లేదా పూర్తి పరమానంద స్థితి
వీటికన్నిటికీ అతీతమైనది తురీయావస్థ పూర్తి పరమానంద స్థితి, సమాధి స్థితి. దీన్ని సాధించడానికి పతంజలి మహర్షి యోగ శాస్త్రంలో అష్టాంగ యోగ మార్గాలు ఇచ్చారు.
అవి బహిరంగ సాధనలు (1 TO 5)
- యమ
- నియమ
- ఆసన
- ప్రాణాయామ
- ప్రత్యాహార
అంతరంగ సాధనలు
- ధారణ
- ధ్యాన
- సమాధి
- యమ నియమాలు (1&2) ఇవి రోజు వారీ జీవన సాధనలు. క్రమశిక్షణతో కోరికలు మరియు అనుబంధాల నుండి విడివడి భగవంతుని చేరుటకు సాధనాలు. హృదయాన్ని శుద్ధి చేసుకుని సాత్విక స్వభావం పెంచుతాయి. ధ్యానానికి దారితీసి ఇతర విభాగాలను ఆరోగ్యవంతం చేస్తాయి.
- ఆసనం – ధ్యానానికి కూర్చునే భంగిమ చాలా ముఖ్యం. ధ్యానానికి మంచి సౌకర్యంగా కూర్చోండి. వెన్నుముక నిటారుగా ఉంచాలి. కాళ్ళు ముడిచి రెండు చేతులు చాపి మోకాళ్ళపై అరచేతి వేళ్లను బొటనవేలు చూపుడు వేలు జోడించాలి. బొటనవేలు పరమాత్మ చూపుడు వేలు జీవాత్మ మిగిలిన మూడు వ్రేళ్ళు మూడు గుణాలు.
- ప్రాణాయామం– శ్వాస ప్రక్రియ ఉచ్ఛ్వాస నిశ్వాసల నియంత్రణ ప్రాణాయామం. ఇది మనసును నియంత్రించడానికి క్రమబద్ధీకరణకు ఉపయోగ పడుతుంది. ముందుగా కుడి ముక్కు బంధించి ఎడుమ ముక్కు రంధ్రంతో గాలి బాగా పీల్చడం, బంధించడం, వదలడం. 4 సెకన్లు గాలి పీల్చుకుని 16 సెకన్లు బంధించి 8 సెకన్లు వదలాలి. శ్వాస సున్నితంగా ఉండాలి. దీర్ఘంగా పీల్చే శ్వాస ఆయువును పెంచుతుంది. మనసును శుద్ధి చేసి స్థిరపరచిన తరువాత ప్రాణాయామం చేయవలసి ఉంటుంది.
- ప్రత్యాహార– ఇతర వస్తువులు అనుబంధాల నుండి ఇంద్రియాలను ఉపసంహరించుకోవడం. లోపల ( స్వీయం) భగవంతుని వైపు తిప్పడం.
- ధారణ– మనసును ఏదో ఒక నిర్దిష్ట వస్తువుపై కేంద్రీకరించాలి. రెండు కనుబొమల మధ్య (భ్రూమధ్య) కేంద్రీకరించడం. వస్తువు ఏదో ఒక చిత్రం లేదా జ్యోతి కావచ్చు. ఒకే కోణంలో చూస్తూ ఏకాగ్రత సాధించాలి.
- ధ్యానం– బాహ్యేంద్రియాలపై ధ్యాస లేకుండా నిర్దిష్ట కాలంలో ఒకే కోణంలో ఏకాగ్రతగా మనసును నిలపడం. దీనికి జపం సహాయపడుతుంది. జపం చుక్కాని వంటిది. ధ్యానాన్ని సరియైన మార్గంలో ఉంచడానికి దోహదం చేస్తుంది.
- సమాధి– చాలా కాలం పాటు ధ్యానం లో ఉండటం. తాను ధ్యానం చేస్తున్నాను అని మరిచిపోయి ఆ స్థితిలో ఉంటాడు. దీని వల్ల తన దైవిక స్వరూపాన్ని భగవంతునితో ఏకత్వాన్ని తెలుసుకుంటాడు.
ధ్యానం కోసం కొన్ని ఆచరణాత్మక సూచనలు:-
I. ధ్యాన సమయం
తెల్లవారుజామున 3 గంటల నుంచి 6 గంటల వరకు బ్రహ్మ ముహూర్తం. ధ్యానానికి ఇది మంచి సమయం. మనం ప్రతి రోజూ ఒకే సమయానికి ధ్యానం చేయాలి. ఈ సమయం శుభప్రదం ఎందుకంటే….
- ఏ విధమైన పరధ్యానం ఉండదు
- తెల్లవారుజామును ఎవరైనా స్వచ్చంగా భావిస్తారు
- హిమాలయాల్లో మహర్షులు ఈ సమయంలో ధ్యానం చేస్తారు, ఆ తర్వాత సమయమంతా ఆధ్యాత్మిక ప్రవాహం మొత్తం వాతావరణంలో ఆధ్యాత్మిక ప్రకంపనలు కొనసాగుతాయి.
- హఠ యోగం ప్రకారం ఈ సమయంలోనే శ్వాస స్థిరంగా ఉంటుంది అలాగే సూర్యోదయం సూర్యాస్తమయం సమయాలు ధ్యానానికి అనువైన కాలం
II. భంగిమ మరియు ఆసనం (సీటు)
a. సౌకర్యవంతమైన భంగిమలో కూర్చోవాలి ప్రాధాన్యత పద్మాసనం. కటిక నేలపై కూర్చోకూడదు. మెత్తని బట్టతో కప్పిన చెక్క పలకపై కూర్చోవచ్చు. చెక్క పలక మనలో ఉత్పన్నమయ్యే శక్తిని గురుత్వాకర్షణ శక్తి ద్వారా భూమి లోకి పోనివ్వదు.
b. మనం ఉత్తరం వైపు గాని తూర్పు వైపు గాని తిరిగి కూర్చోవాలి
c. ఓంకార జపం – ముందుగా కొన్ని సార్లు ఓంకారం జపంతో ప్రారంభించాలి
d. శరణాగతి కోసం మానసిక స్థితి సోహం – హమ్ అని ఉచ్చరిస్తూ దీర్ఘంగా ఊపిరి పీల్చుకుని సో అని జపించండి ఇది నరాలను శుద్ధి చేస్తుంది
e. శరీరాన్ని పరిశుభ్రం చేయడం అన్ని జీవుల పట్ల ప్రేమను నింపుకోవడం తో పాటు జ్యోతి ధ్యానం చేయడం. ఒక దీపం లేదా కొవ్వొత్తి వెలిగించి ముందు పెట్టుకొని తదేకంగా చూసి కళ్లు మూసుకోండి. కాంతి మనలోకి ప్రవేశించినట్లు ఊహించండి. శరీరంలో అన్ని భాగాలను శుద్ధి చేసినట్లు హృదయంలో ప్రవేశించి కమలం రేకులు ఒక్కొక్కటి విచ్చుకొన్నట్లు భావన. మన ఆలోచనలు మరియు భావోద్వేగాలు శుద్ధి చేసినట్లు ఊహించుకోండి. కాంతి ఇతర అవయవాలకు వ్యాపించి శుద్ధి చేస్తుంది. కాంతిని మనం ప్రేమించేవారిపై శత్రువులపై కూడా ప్రసరించేలా వ్యాపింప చేయండి మన మనసు విశాలం గావించాలి. అందరి మీద మనలోని ప్రేమ పొంగి పొర్లాలి. ఇప్పుడు మనం స్వామి వారిని లేదా ఇష్ట దైవాన్ని కాంతిలో దర్శించుదాం. ఎందుకంటే వెలుగే దేవుడు, దేవుడే వెలుగు. మన శరీరమే దేవాలయం. మనం ధృడ సంకల్ప శక్తిని పెంపొందించుకుంటే తప్ప శారీరక స్పృహ వదులుకోవడం సాధ్యం కాదు.
f. జప సహిత ధ్యానం:- జపం అనేది గురు మంత్రాన్ని లేదా ఇష్ట దేవతా నామాన్ని పదే పదే ఉచ్చరించే క్రమశిక్షణ. దీన్ని మూడు విధాలుగా చేయవచ్చు
- వైఖరి – నామాన్ని బిగ్గరగా జపించడం
- ఉపాంశు – పెదవులు కదుపుతూ నిశ్శబ్దంగా ఉచ్చారణ.
- మానసిక్ – మానసికంగా నామాన్ని స్మరించడం.
ప్రారంభంలో 108 పూసలు ఉన్న జప మాలను ఉపయోగించాలి. ఎందుకంటే 12ను 9 తో గుణించినపుడు 108 అవుతుంది. 9 భగవంతుని సంఖ్య, 108 సంపూర్ణతను, భగవంతుని నిరాకార సాకార తత్వాల అంశాలను సూచిస్తుంది. జపమాలను మధ్య వేలిపై పెట్టుకుని క్రింది మూడు వేళ్ళను కలిపి ఉంచడం ఒక ప్రత్యేక మార్గం. త్రిగుణాలును నామం జపంతో అణిచి ఉంచడం కూడా, బొటనవేలు బ్రహ్మకు చూపుడు వేలు మన వ్యక్తిత్వం అహంకారం సూచిస్తాయి. జీవి తనకు తాను పరమాత్మకు లొంగిపోయి నామ జపము సాగించే జ్ఞాన ముద్ర అవుతుంది. జపం చేస్తున్నప్పుడు ఆ నామం యొక్క రూపాన్ని చిత్రించుకోవడం చేయాలి, మనసు జపం నుంచి ఎటో వెళ్లిపోయినా తిరిగి నామం ద్వారా రూపాన్ని దర్శించాలి. ఇలాగే మనసును నియంత్రించి లొంగదీసుకోవాలి. ఈ సాధననే జప సహిత ధ్యానం అంటారు. చివరకు భగవంతుడు ఆ నామ రూపాన్ని స్వీకరించి మన ఆకాంక్షలను నెరవేరుస్తాడు.
ధ్యానం తర్వాత అకస్మాత్తుగా లేవకండి ముందుగా ధ్యానం లో మనకు లభించిన ఆనందాన్ని మననం చేసుకోవాలి. అవయవాలను కొద్ది సేపు సడలించుకోవాలి. తర్వాత నెమ్మదిగా లేవాలి. మన హృదయంలోని ఆనందాన్ని శాంతిని పదిలంగా నిలుపుకుని రోజు వారీ విధుల్లో ప్రవేశించాలి.
తరతి శోకం ఆత్మవిద్
ఆత్మను గ్రహించినవాడు దుఃఖ సాగరాన్ని దాటుతాడు. స్వీయ అవగాహన జీవితంలోని అన్ని దుఃఖాలకు ముగింపు పలికి ఆనందానికి దారితీస్తుంది.